
రైల్వే టిక్కెట్ కౌంటర్‌ను పునరుద్ధరించాలి
అమలాపురం టౌన్: పట్టణంలోని మున్సిపల్ సర్క్యులర్ బజార్ (షాపింగ్ కాంప్లెక్స్)లో గతంలో కేటాయించినట్లే రైల్వే టిక్కెట్ రిజర్వేషన్ కౌంటర్‌ను పునరుద్ధరించాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) ప్రతినిధి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేఆర్‌ఎస్‌ఎస్ సభ్యులతో కలసి బుధవారం మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కమిషనర్‌తో ఆ విషయంపై కేఆర్‌ఎస్‌ఎస్ బృందం చర్చించింది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు మున్సిపాలిటీ ఉచితంగా రెండు షాపులు ఇచ్చేందుకు కౌన్సిల్ గతంలోనే ఆమోదం తెలిపిన విషయాన్ని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకూ ఆ దిశగా ఏర్పాట్లు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ ప్రజలు రైల్వే టిక్కెట్ బుకింగ్ సౌకర్యం లేక, ఇతర ప్రాంతాలకు వెళ్లి రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఎమ్మెల్సీతో పాటు కేఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, సప్పా నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కమిషనర్‌తో పాటు మున్సిపల్ రెవెన్యూ అధికారి భూపతి శ్రీలక్ష్మి కూడా ఈ చర్చల్లో ఉన్నారు. గతంలో రైల్వే టిక్కెట్ కౌంటర్‌కు షాపులు ఉచితంగా ఇచ్చేందుకు వీలు లేదంటూ అటు ప్రభుత్వం, ఇటు కోర్టు ఉత్తర్వులు ఇచ్చాయి. ఈ ఆదేశాలతో అధికారులు ఆ రెండు షాపులకు వేలం నిర్వహించేందుకు సమయాత్తమవుతున్న వేళ కేఆర్‌ఎస్‌ఎస్ బృందం కమిషనర్‌కు వినతి పత్రం ఇవ్వడంతో ఆ షాపుల వేలాన్ని కమిషనర్ తాత్కాలికంగా వాయిదా వేయించారు. ఒక వేళ ఆ రెండు షాపులకు అద్దె చెల్లించాల్సి వస్తే కేఆర్‌ఎస్‌ఎస్ తరఫున కొంత మొత్తాన్ని భరించేందుకు ఎమ్మెల్సీ ముందుకు వచ్చినప్పటికీ అధికారులు ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.