
అశక్తతా.. ఆగ్రహమా?
ఇలా అయితే పంట పండించేలేం
గతంలో నాలుగు ఎకరాలు సాగు చేసేవాడిని. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేక రెండెకరాలలో పంట పండించేవాడిని. ఈ ఏడాది తొలకరి మొత్తం మానేశాను. ముంపునీరు దిగేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ సమస్య పరిష్కరించకుంటే నాతో పాటు మా రైతులు ఎవరూ సాగు చేసే అవకాశం లేదు.
– అంతర్వేదిపాలెం వెంకటేశ్వర్లు, కౌలురైతు,
ఉయ్యూరివారిమెరక, సకినేటిపల్లి మండలం.
సహనానికి నిలువెత్తు రూపం భూదేవి. అదే లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నాడో ఏమో పుడమిపుత్రుడు ఎంత కష్టం ఎదురైనా.. ఎంత నష్టం చవిచూస్తున్నా నాగలి చేతపట్టి నా బొందో అనుకుంటూ అతడిని నమ్ముకున్న జనం ఆకలి తీర్చడానికి శత విధాల కృషి చేస్తుంటాడు. అయినప్పటికీ అతనికి కనీస సహకారం లభించని పరిస్థితులు ఎదురైతే కాడి వదిలేయడం తప్ప ఆయన చేసేదేమీ ఉండదు. కాలం కలసిరావాలి.. వరుణుడు కరుణించాలి.. ప్రభుత్వాలు సహకరించాలి.. ఇవన్నీ సకాలంలో సహకరిస్తేనే అతను పునరుత్తేజం పొంది ప్రజలకు నాలుగు మెతుకులు పెట్టగలడు. కాలం.. వరుణుడి కరుణ పక్కన పెడితే ప్రభుత్వ సహకారం చేతిలో ఉన్నదే. అన్నదాతను విస్మరించిన ప్రభుత్వం మనలేదన్నది చారిత్రక సత్యం. అన్నదాత ముందుకు సాగాలంటే ప్రభుత్వం చేదోడుగా నిలవాల్సిందే. ఇవేమీ చేయకపోయినా అన్నదాత కొట్టడు.. తిట్టడు.. ఆగ్రహించడు. అవి ప్రదర్శించిన అతనికి జరిగే న్యాయం అంతంతే. అతడు కేవలం కినుక వహిస్తే చాలు. మౌనం దాలిస్తే చాలదా..? ఆ తరువాత కాగల కార్యం గంధర్వులే చేస్తారు.
సాక్షి, అమలాపురం: ఏడాదికి మూడు పంటలు పండే గోదావరి డెల్టాలో ఖరీఫ్ తొలకరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. జూలై మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా సగం ఆయకట్టు ప్రాంతాల్లో కూడా నాట్లు పడలేదు. శివారులో అయితే పరిస్థితి మరీ దారుణం. గడిచిన దశాబ్ద కాలంగా డెల్టా శివారుల్లో ఏటా ఐదారు వేల ఎకరాల్లో రైతులు సాగు చేయకపోవడం పరిపాటే. కాని ఈ ఏడాది దుస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా తయారైంది. జిల్లాలో 22 మండలాల్లో ఏకంగా ఆరు మండలాల్లో ఇప్పటి వరకు ఒక్క ఎకరాలో కూడా వరినాట్లు పడలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో ఖరీఫ్ అంచనా 1,63,399 ఎకరాలు కాగా, బుధవారం వరకు 47,843 ఎకరాల్లో నాట్లు పడ్డాయి. రాజోలు దీవిలో మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన మండలాల్లో నాట్లు పడలేదు. రాజోలు మండలంలో 26 ఎకరాల్లోనూ, పి.గన్నవరంలో 93 ఎకరాలు, అంబాజీపేటలో 126 ఎకరాలు, అమలాపురంలో 145 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశాారు. ముమ్మిడివరం 225, ఐ.పోలవరం 249, కె.గంగవరం 389, అయినవిల్లిలో 605 ఎకరాలో చొప్పున వెయ్యి ఎకరాల కన్నా తక్కువ నాట్లు వేశారు.
ముఖం చాటేస్తున్న ప్రభుత్వం
శివారుల్లో రైతులు సాగు చేయడానికి ఏటా వెనకాడుతూనే ఉన్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానంగా మారడంతో ఇక్కడ వరిసాగు అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ ఏడాది మరీ దారుణమైన పరిస్థితి. ధాన్యం సొమ్ములు సకాలంలో ఇవ్వకుండా రైతులను కూటమి ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. అన్నదాత సుఖీభవ సొమ్ములు ఒక ఏడాది ఎగ్గొట్టిన ప్రభుత్వం రెండో ఏడాది సొమ్ములు ఏప్రిల్, మే నెలలో వేస్తామని మోసంచేశారు. ఉచిత పంటల బీమా ఎత్తివేసింది. పంట నష్టపోతే పరిహారం ఇస్తారనే నమ్మకం రైతులకు కలగడం లేదు. దీనికి తోడు ఈ ఏడాది లోటు వర్షం. ఇదీ అన్నదాత వెనుకబాటుకు కారణం.
కనికరించని వరుణుడు.. శివార్లకు సాగని నీరు..
గోదావరి డెల్టాలోని శివారుల్లో ఖరీఫ్ సాగు జూదంగా మారింది. కొద్దిపాటి వర్షానికే చేలు మునుగుతున్నాయని రైతులు సాగుకు దూరమవుతున్నారు. అటువంటిది ఇప్పుడు ఒకవైపు వర్షాలు లేకపోగా.. మరోవైపు శివారుకు సాగునీరందకపోవడం మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. దీనితో రైతులు మోటార్ల నుంచి నీరు తోడుకుని నారుమడులు రక్షించుకుంటున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో కాట్రేనికోన మండలం శివారులో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఈ మండలం పల్లంకుర్రు ఆయకట్టు పరిధిలో రైతులు దమ్ములు చేద్దామంటే నీరందడం లేదు. మొదటి దమ్ములు చేసిన భూములకు రెండోసారి దమ్ములు చేసేందుకు నీరందడం లేదు. మధ్య డెల్టాకు 2,600 క్యూసెక్కుల నీరు వదలడం అంటే మాటలు కాదు. పంట కాలువలకు 70 డ్యూటీ చొప్పున (ఒక క్యూసెక్కు 70 ఎకరాలకు) ఇస్తున్నారు. అయినా శివారుకు సాగు నీరు అందడం లేదు. దీంతో మోటార్లతో రైతులు నీరు తోడుకోవాల్సి వస్తోంది. పల్లంకుర్రు ప్రధాన కాలువ మీద సుమారు 20 వరకు ఇంజిన్లు పెట్టి రైతులు తమ పొలాలకు నీరు తోడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పంట కాలువ వ్యవస్థ ఆధ్వానంగా ఉండడంతో ఈ దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.
ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు
తొలకరి పంట జూదంగా మారింది. అయినా ధైర్యం చేసి సాగు చేస్తున్నాం. కాని ఈసారి వర్షాలు లేవు, పంట కాలువల నుంచి నీరు రాకపోవడం మరీ విడ్డూరంగా ఉంది. ఇలాంటి దశలో సాగు ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఏటా 25 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. ఈ ఏడాదంత దుర్భరమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. నారుమడులను కాపాడుకునేందుకు ఇంజిన్లతో నీరు తోడుకోవాల్సి రావడం తొలకరిలో ఇదే మొదటసారి.
– పులుగు దశరథ రామయ్య,
కౌలు రైతు, పల్లంకుర్రు, కాట్రేనికోన మండలం
నానాటికీ తీసికట్టు
రాజోలు దీవిలో తొలకరి సాగు మరీ దారుణంగా మారింది. సఖినేటిపల్లి, మలికిపురం, మామిడికుదురు మండలాల్లో ఇంకా నాట్లు పడలేదు సరికదా, సఖినేటిపల్లిలో ఇంత వరకు కేవలం 335 ఎకరాల్లోనూ, మలికిపురం మండలంలో 739 ఎకరాల్లో నారు వేయడం గమనార్హం. శివారు మండలాల్లో సాగు నత్తనడకన సాగుతోంది. నాలుగు మండలాల్లో కలిపి సుమారు 20 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండగా కేవలం 26 ఎకరాల్లో నాట్లు పడ్డాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. సఖినేటిపల్లి మండలం మోరి సరిహద్దులో సాగు చేస్తున్న భూములకు మురుగునీటి సౌకర్యం లేక సార్వాకు రైతులు దూరమవుతున్నారు. ఆక్వా సాగు దారులు మురుగునీటి ప్రవాహం బోదెలను మూసివేస్తుండడంతో సార్వా సాగును రైతులు వదులు కుంటున్నారు.
తొలకరి వదిలేశాం
మోరి సరిహద్దులో మామిడితోట పంటకాలువను ఆనుకుని అంతర్వేదిపాలెంలో ఐదు ఎకరాలు సాగు చేస్తున్నాను. సార్వా సీజన్‌లో మురుగునీరు వెళ్లే మార్గం లేక ఏటా ఊడ్చడం మానేశాను. దాళ్వాకు కూడా రెండు ఎకరాలకు మించి ఊడ్చలేకపోతున్నా. ముంపు సమస్య పరిష్కరించక పోతే ఏటా ఇదే పరిస్థితి. అయినా అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు.
– చెల్లుబోయిన సత్యనారాయణ,
కౌలు రైతు, అంతర్వేదిపాలెం
ఆరు మండలాల్లో నాట్లు శూన్యం
జిల్లాలో సాగని ఖరీఫ్ పనులు
29 శాతం నాట్లు మాత్రమే పూర్తి
మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో
కేవలం 1,100 ఎకరాల్లోనే నారుమడులు
మూడు పంటలు పండే
డెల్టాలో ఎన్నడూ లేని దైన్యం
భరోసా లేక సాగుకు
ఆసక్తి చూపని అన్నదాత

అశక్తతా.. ఆగ్రహమా?

అశక్తతా.. ఆగ్రహమా?

అశక్తతా.. ఆగ్రహమా?

అశక్తతా.. ఆగ్రహమా?

అశక్తతా.. ఆగ్రహమా?

అశక్తతా.. ఆగ్రహమా?

అశక్తతా.. ఆగ్రహమా?