
పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు
● 19 ఏళ్ల లోపు పిల్లలు
సద్వినియోగం చేసుకోవాలి
● అమలాపురం డైస్ కేంద్రం
ఆధ్వర్యంలో సేవలు
● కంటి వైద్య నిపుణుడు దేవకుమార్
అమలాపురం టౌన్: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణలోని డైస్ ఆధ్వర్యంలో చిన్నారులకు కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. రూ.లక్షల వ్యయమయ్యే చికిత్సలను ఈ కేంద్రంలో ఉచితంగా చేస్తున్నట్టు కంటి వైద్య నిపుణుడు యు.దేవకుమార్ తెలిపారు. ప్రభుత్వం, పలువురు ఎన్జీవోలు, ఎన్జీవో సంస్థల సహకారంతో ఆర్‌వోపీ, కంటి శుక్లాలు, మెల్ల కన్ను, కంటి రెప్ప జారటం వంటి కంట సమస్యలకు ప్రయాణ ఖర్చులు కూడా లేకుండా శస్త్ర చికిత్సలు చేయడానికి డైస్ సెంటర్‌లో సదుపాయాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 19 ఏళ్ల పేద కుటుంబాల పిల్లలకు ఈ సెంటర్ అందిస్తున్న కంటి వైద్య సేవలను, చిన్న పిల్లల్లో వచ్చే కంటి సమస్యలను దేవకుమార్ వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేసి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అమలాపురంలోని డైస్ కేంద్రం పని దినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 3 గంటల మధ్య ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 94937 48918 ఫోన్ నంబరులో సంప్రదించాలని తెలిపారు.