
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్‌యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నూతన విద్యావిధానం 36 ఏళ్ల తరువాత రూపొందించారని, దీని ద్వారా ప్రపంచీకరణపై అవగాహన కలుగుతుందని జేఎన్‌యూ ప్రథమ మహిళా వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పేర్కొన్నారు. జేఎన్‌టీయూకేలో నిర్వహిస్తున్న ఓక్ ట్రీ ఉత్సవాల్లో భాగంగా రోల్‌ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర వికసత్ భారత్ – 2047 అంశంపై శుక్రవారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శాంతశ్రీ మాట్లాడుతూ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందన్నారు. టర్కీ, చైనా దేశాలు ఎయిర్‌ఫోర్స్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్న విధంగా భారతదేశం ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జేఎన్‌యూ వంటి విశ్వవిద్యాలయాలు నోబుల్ అవార్డు గ్రహీతలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, విద్యావ్యవస్థలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులకు సాంకేతిక విద్యానైపుణ్యాలను నేర్పించాలన్నారు. జేఎన్‌టీయూకే వంటి ప్రముఖ వర్సిటీల నుంచి ఏరోస్పేస్ సర్వీస్, డిఫెన్స్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్‌క్రాప్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఒకేషనల్ సిస్టమ్, పబ్లిక్ డిజైన్ వంటి కోర్సులను అందించి ఆధునికతకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయే యుద్ధాలను ఎదుర్కొనేలా భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు అన్వేషణలు సాగించి సన్నద్ధమవ్వాలన్నారు. హైదరాబాద్ ఇప్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్‌కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్‌కు వెయ్యిమంది ఉన్నారని, భారతదేశం పరిశోధనపై కేవలం 0.64 శాతం మాత్రమే నిధులు వెచ్చిస్తోందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ వీసీ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, తయారీ వంటి రంగాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనించేలా చేయాలన్నారు. నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టి సోషల్ సైన్స్, టెక్నికల్ కోర్సులను కలిపి నేర్పించాలని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మోహనరావు, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పద్మరాజు పాల్గొన్నారు.