
ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి
తాళ్లరేవు: కూటమి ప్రభుత్వం గద్దె నెక్కి 13 నెలలు కావస్తున్నా ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ అన్నారు. ఆయన బుధవారం జార్జిపేట పంచాయతీలో పర్యటించారు. ఆ గ్రామ ఉప సర్పంచ్ పేర్ని ఆదినారాయణమూర్తి ఆధ్వర్యంలో పలువురిని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలంటూ హామీలు ఇచ్చారన్నారు. వాటిలో పింఛన్ తప్ప మిగిలిన వాటిని అందజేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. పైగా సుపరిపాలన అందించామంటూ ప్రజల మధ్యలోకి ఏ విధంగా వస్తున్నారని ప్రశ్నించారు. హామీలు అమలు చేయని కూటమి నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. రోజురోజుకూ మాజీ సీఎం జగన్‌కు ఆదరణ పెరుగుతోందని, ఎక్కడకు వెళ్లినా వేల మంది ప్రజలు తరలివస్తున్నారన్నారు. దాన్ని చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారన్నారు. అందుకే వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పాల్జేస్తున్నారన్నారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా సహనం వహించి, జగన్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీని నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడి దుర్మరణం పాలైన ఎంఎల్‌కే నగర్ గ్రామస్తుడు పువ్వల లక్ష్మణ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో బడుగు శ్రీనివాసరావు, బొమ్మి సురేష్, స్థానిక నాయకులు ఆదినారాయణమూర్తి, శీలి రాజు, చోడే శ్రీరామ్మూర్తి, పిల్లి కృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులపై
అక్రమ కేసులు దారుణం
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్