
బాల బాలాజీకి రూ.1.60 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయానికి బుధవారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.1,60,462 ఆదాయం వచ్చింది. 1,600 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 700 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు.
అభివృద్ధి పనులకు
శంకుస్థాపన
అల్లవరం: ఉపాధి, ఉద్యోగాల లక్ష్యంగా గురుకులాల్లో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గోడిలో బుధవారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలోని బాలురు, బాలికల గురుకులాలను పరిశీలించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు, డీఈ రాజ్‌కుమార్, సర్పంచ్ తోట శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
వాడపల్లి క్షేత్రంలో
భక్తులకు మరిన్ని సౌకర్యాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద వెడల్పాటి మార్గాలను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లకు అదనంగా మరికొన్ని కౌంటర్లు పెంచనున్నామన్నారు. వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తహశీల్దార్ రాజేశ్వరరావు, డీసీ చక్రధరరావు బుధవారం పరిశీలించారు.
రూ.50 వేల విరాళం
వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆకివీడుకు చెందిన కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. దాతలకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందించారు.
దరఖాస్తుల ఆహ్వానం
వాడపల్లి క్షేత్రంలో స్వామి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున, వారి సౌకర్యార్థం ప్రతి శనివారం దేవస్థానం ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ శిబిరంలో సేవ చేయుటకు నర్సింగ్ క్వాలిఫైడ్ అయిన మహిళలు / పురుషుల నుంచి దరఖాస్తులు కోరుచున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
20న జిల్లా స్థాయి
యోగాసన పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర భారత్ యోగాసన క్రీడా సంఘం, కోకనాడ యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఆదివారం స్థానిక జేఎన్‌టీయూ యోగా హాల్‌లో జిల్లా యోగాసన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు, అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ సుధాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లు నిండిన వారి నుంచి 14 ఏళ్ల వారి వరకు, 14 నుంచి 18 వరకు, 18 నుంచి 28 వరకు, 28 నుంచి 35 వరకు, 35 నుంచి 45 వరకు, 45 నుంచి 55 ఏళ్లవారి వరకు వివిధ కేటగిరీలలో యోగాసన పోటీలు జరుగుతాయని వారు తెలిపారు. ఆరు విభాగాల్లో బాలురు, బాలికలు పాల్గొనవచ్చునని ప్రపంచ యోగాసన, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం ట్రెడిషనల్ యోగ, రిథమిక్ యోగ, ఆర్టిస్ట్ యోగ, 10 రకాల పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 91334 33491 నంబరులో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.