
అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలి
అమలాపురం రూరల్: భూయాజమాన్యాల (జాయింట్ ఎల్‌పీఎం) భూములను విభజిస్తూ అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి సర్వే సిబ్బందిని ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, భూపరిపాలన కమిషనర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి బుధవారం అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాయింట్ ఎల్‌పీఎంల విభజన, అందరికీ ఇళ్లు, రీ వెరిఫికేషన్ ఆఫ్ అవుట్ సైడ్, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఎస్సీ ఎస్టీ గ్రామాల్లో బరియల్ గ్రౌండ్‌కు స్థల సేకరణ, రీసర్వే అంశాల పురోగతిపై జాయింట్ కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జేసీ.. అధికారులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాలలో బరియల్ గ్రౌండ్ విస్తీర్ణాలను ఆరా తీసి నివేదిక సమర్పించాలన్నారు. అర్హులందరికీ ఇళ్లకు సంబంధించి లే అవుట్లలో ఇప్పటి వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయని ఖాళీ జాగాలను గుర్తించాలని, వాటిని అర్హుల అభీష్టానికి అనుగుణంగా పంపిణీ చేయాలన్నారు. భూ సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి అర్హులకు న్యాయం చేకూర్చాలన్నారు. రీ సర్వేకు సంబంధించి నూరు శాతం నోటిఫికేషన్లు జారీ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు పి.శ్రీకర్, దేవరకొండ అఖిల, జిల్లా సర్వేన్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.బోసుబాబు పాల్గొన్నారు.