ప్రగతి వారధి... సంక్షేమ సారథి | - | Sakshi
Sakshi News home page

ప్రగతి వారధి... సంక్షేమ సారథి

Jul 8 2025 7:08 AM | Updated on Jul 8 2025 7:08 AM

ప్రగత

ప్రగతి వారధి... సంక్షేమ సారథి

గోదావరి డెల్టా ఆధునీకరణ పనులు

సాక్షి, అమలాపురం: ఒక మనిషి నిండు నూరేళ్లు జనం మధ్య ఉండాలంటే వందేళ్లు జీవించనక్కర్లేదు. సమాజానికి చేసిన సేవల వల్ల అతను మరణించిన తరువాత కూడా జనం మనసులో నిలిచిపోవడం ద్వారా నిండు నూరేళ్ల జీవనం పూర్తి చేసుకుంటారు. ఇటువంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఒకరు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో అధిక కాలం పోరాటాలతోనే సరిపోగా.. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల నాలుగు నెలల కాలంలో సంక్షేమ సారధిగా... అభివృద్ధి ప్రదాతగా రాష్ట్రంలోనే కాదు.. దేశంలో తనకుంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల, రైతు, మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి జిల్లా.. మరీ ముఖ్యంగా కోనసీమ అభివృద్ధిపై చెరగని సంతకం చేశారు. అందుకే ఆయన మృతి చెంది 16 ఏళ్లు కావస్తున్నా జనం గుండెల్లో ఆయన వేసిన ముద్ర నేటికీ చెరగడం లేదు. నేడు దివంగత నేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ‘సాక్షి’ కథనం...

డెల్టా కాలువలకు కొత్త రూపం

● గోదావరి డెల్టా రూపశిల్పి సర్దార్‌ కాటన్‌ తరువాత డెల్టా వ్యవస్థ పుననిర్మాణానికి దివంగత మహానేత పెద్ద పీట వేశారు. అధ్వాన స్థితికి చేరిన డెల్టా వ్యవస్థ మొత్తం రూపరేఖలను మార్చేందుకు సిద్ధమయ్యారు. కాటన్‌ చేతిలో రూపొందిన గోదావరి డెల్టా వ్యవస్థలో చిన్నచిన్న మరమ్మతు పనులు, క్లోజర్‌ పనులు మినహా పెద్దగా ఆధునీకరణ పనులు చేపట్టలేదు. వైఎస్సార్‌ హయాంలో రూ.1,160 కోట్లతో పంట కాలువల, రూ.550 కోట్లతో మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులు చేపట్టారు.

● ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని సుమారు 10.60 లక్షల ఎకరాల వరి ఆయకట్టుకు సంవృద్ధిగా సాగునీరు వెళ్లేందుకు, పంట చేల నుంచి ముంపు నీరు దిగేందుకు ఆయన చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌ బతికి ఉండగా వేగంగా జరిగిన పనులు ఆయన మృతితో ఆటకెక్కాయి.

● పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా కొత్తగా 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు తీసుకురావడమే కాకుండా... డెల్టాలో 10.60 లక్షల ఎకరాల గోదావరి ఆయకట్టు స్థిరీకరణకు చర్యలు తీసుకున్నారు.

● ఐలెండ్‌కు సాగునీరందించే అన్నంపల్లి అక్విడెక్టు ఆధ్వానంగా మారడంతో రూ.48 కోట్లతో కొత్త అక్విడెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.

‘అచ్చ తెలుగు అన్నదాత’

దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పేరు స్ఫురణకు వచ్చినప్పుడు నెత్తిన తలపాగా.. మోముపై చిరు నవ్వు.. తెల్లని దుస్తులు.. తెలుగు వారి సంప్రదాయ పంచెకట్టు గుర్తు రాకమానవు. అచ్చ తెలుగు పల్లె రైతు ఆహార్యంతో వైఎస్సార్‌ రైతుకు ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌. రైతు కట్టూ బొట్టూ మాత్రమే కాదు.. అధికారంలో ఉన్నన్నాళ్లూ రైతు అనుకూల విధానాలు, రైతుకు మేలు చేసే పనులతో రైతు పక్షపాతిగా వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నాడు ఉమ్మడి జిల్లా రైతుల కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలను ఈ ప్రాంత రైతులు ఎన్నటికీ మరువరు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సైతం తండ్రి బాటలోనై రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.

రైతు పక్షపాతం

రైతులకు మేలు జరుగుతోంది అంటే ఎటువంటి కార్యక్రమం అమలు చేయాలన్నా వైఎస్సార్‌ వెనకడుగు వేయలేదు. అందుకే రైతు అనుకూలమైన నిర్ణయాలను అత్యంత వేగంగా తీసుకునేవారు. దానిలో ముఖ్యమైంది ఉచిత విద్యుత్‌. దీనివల్ల జిల్లాలో ఉద్యాన రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. ముఖ్యంగా కొబ్బరి, అరటి, పసుపు, కూరగాయల పంటలు సాగు చేసే రైతులకు ఉచిత విద్యుత్‌ చేసిన మేలు అంతాఇంతా కాదు. జిల్లాలో మొత్తం 20,452 వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు ఉండగా, వీటిలో 11,901 పంపు సెట్లకు ఉచిత విద్యుత్‌ అందుతోందంటే అందుకు దివంగత నేత వైఎస్సార్‌ కారణం.

● 2008లో గోదావరి డెల్టాలో రబీకి నీటి ఎద్దడి ఏర్పడింది. అప్పట్లో సీఎం హోదాలో రాజమహేంద్రవరం వచ్చిన వైఎస్సార్‌ పరిస్థిని అర్థం చేసుకున్నారు. రూ.7.50 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకున్నారు. డ్రెయిన్లపై క్రాస్‌బండ్‌ల ఏర్పాటు, మోటార్లతో కాలువల్లో నీరు చేలకు మళ్లింపుతోపాటు గోదావరిలో వృథా నీటిని పంట కాలువలకు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. తరువాత కాలంలో ఎప్పుడు నీటి ఎద్దడి వచ్చినా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇదే విధానంతో రబీని గట్టెక్కిస్తుండడం విశేషం.

● 2007 ఏడాది కొబ్బరి సంక్షోభంలో ఉంది. నాడు కోనసీమకు చెందిన రైతులు స్వయంగా వైఎస్సార్‌ను కలిసి చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఆయన కొత్త కొబ్బరి (తయారీ కొబ్బరి)పై ఉన్న రెండు శాతం వ్యాట్‌ పన్నుకు మినహాయింపు ఇచ్చారు. మరో సందర్భంలో కేజీ రూ.9.20 చేసి కొబ్బరి కాయను మార్కెటింగ్‌ శాఖ ద్వారా కొనుగోలు చేయించారు.

ఇక్కడే పలు కార్యక్రమాలకు శ్రీకారం

● వైఎస్సార్‌కు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఒక ప్రత్యేకాభిమానం ఉండేది. ఆ కారణంగానే ఆయన ఇక్కడ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోనసీమకు వైఎస్సార్‌ చేసిన మేలు అంతాఇంతా కాదు. భారీ వరదలు వచ్చిన ప్రతిసారి ఏటిగట్లకు గండ్లుపడి కోనసీమకు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం చెప్పలేనంత ఉండేది. 2006లో గోదావరికి రికార్డు స్థాయిలో వచ్చిన వరదల వల్ల జిల్లాలో అయినవిల్లి మండలం శానపల్లిలంక, పి.గన్నవరం మండలం మొండెపులంక వద్ద ఏటిగట్లకు గండ్లు పడ్డాయి. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీనిని గుర్తించిన వైఎస్సార్‌ జిల్లాలో బలహీనంగా ఉన్న ఏటిగట్ల పటిష్ట పనులకు రూ.550 కోట్లు కేటాయించగా, పనులు పూర్తయ్యే సమయానికి రూ.650 కోట్లకు చేరింది. ఆయన హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయి.

● గోదావరి నదీ కోత నివారణకు రూ.90 కోట్లు కేటాయించి గ్రోయిన్లు, రివిట్‌మెంట్‌ల నిర్మాణాలు చేపట్టారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంక కోతలు ఆగి ఇంకా ఆ గ్రామాలు ఉన్నాయంటే అందుకు వైఎస్సార్‌ కారణం.

● రాజీవ్‌ గృహకల్పలో భాగంగా అమలాపురం మండలం నల్లమిల్లిలో శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మొదటసారి ఈ కార్యక్రమానికి అమలాపురంలో శ్రీకారం చుట్టారు. ఇదే జిల్లా అల్లవరంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీవ్‌నగర్‌ బాటకు సైతం అమలాపురం మున్సిపాలిటీలో శ్రీకారం చుట్టారు.

ఉచిత విద్యుత్‌ బోర్లు

‘కోనసీమ’పై చెరగని...

వైఎస్సార్‌ సంతకం

కాటన్‌ తరువాత డెల్టా

ఆధునీకరణకు పెద్ద పీట

డెల్టా కాలువ వ్యవస్థకు రూ.1,160 కోట్లు

రూ.550 కోట్లతో మురుగునీటి

కాలువ వ్యవస్థ ఆధునీకరణ

ఏటిగట్ల పటిష్ట పనులకు రూ.650 కోట్లు

రూ.48 కోట్లతో అన్నంపల్లి

అక్విడెక్టు పనులు

కోనసీమ జిల్లాలో పలు అభివృద్ధి

కార్యక్రమాలకు శ్రీకారం

ప్రగతి వారధి... సంక్షేమ సారథి1
1/4

ప్రగతి వారధి... సంక్షేమ సారథి

ప్రగతి వారధి... సంక్షేమ సారథి2
2/4

ప్రగతి వారధి... సంక్షేమ సారథి

ప్రగతి వారధి... సంక్షేమ సారథి3
3/4

ప్రగతి వారధి... సంక్షేమ సారథి

ప్రగతి వారధి... సంక్షేమ సారథి4
4/4

ప్రగతి వారధి... సంక్షేమ సారథి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement