
మన బడి.. మన బాధ్యత
● రేపు పాఠశాలల్లో మెగా పీటీఎం 2.0
● ఏర్పాట్లను పూర్తి చేసిన విద్యాశాఖ
రాయవరం: మన బడి.. మన చిన్నారుల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. చిన్నారుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషితో పాటుగా తల్లిదండ్రుల బాధ్యత కూడా ముఖ్యం. దీనిలో భాగంగా గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ డే నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికి మెగా పీటీఎం 2.0గా నామకరణం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,150 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దీనిలో భాగంగా గత విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల ఫలితాలతో కూడిన హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థుల తల్లిదండ్రులకు అందించనున్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ అధికంగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తారు. సైబర్ నేరాలపై మహిళా పోలీసులు అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. వారితో పాటు తల్లులకు రంగవల్లులు పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాలకు సంబంధించిన 30 సెకన్ల వీడియో, మూడు ఫొటోలను లీప్ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 1,561 పాఠశాలలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.1.65 కోట్లు విడుదల చేశారు. ఆ నిధుల నుంచి 20 శాతం మెగా పేటీఎం నిర్వహణకు వెచ్చించాలని సమగ్ర శిక్షా ఎస్‌పీడీ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు చేశామని సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి.మమ్మీ తెలిపారు.
తల్లిదండ్రులు హాజరు కావాలి
తమ చిన్నారుల విద్యా ప్రగతిని తెలుసుకునేందుకు, పాఠశాల అ భివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు తల్లిదండ్రులు మెగా పీటీఎంకు హాజరవ్వాలి. ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సమావేశాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన ఆదేశాలను డీవైఈవో, ఎంఈవోలకు అందజేశాం.
– డాక్టర్ షేక్ సలీం బాషా,
జిల్లా విద్యాశాఖాధికారి, అమలాపురం