
ఉచిత బస్సు ఏది చంద్రబాబూ?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
జగ్గిరెడ్డి వినూత్న నిరసన
● క్యూఆర్ కోడ్‌పై ప్రయాణికులకు
అవగాహన
రావులపాలెం: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉన్న ఉచిత బస్సు ఏది? అంటూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీ శ్రేణులతో కలసి మంగళవారం ఆయన రావులపాలెం డిపోలో బస్సు ఎక్కారు. ఆయన వెంట అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఉన్నారు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా మడికి వరకూ ప్రయాణం చేశారు. మార్గం మధ్యలో జొన్నాడ సెంటర్ వద్ద రాజోలు ఇన్‌చార్జి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికులకు ఉచిత బస్సు హామీ అమలుపై బాబు చేస్తున్న మోసాన్ని వివరించారు. ఉచిత బస్సు లేదంటూ నినాదాలు చేశారు. అనంతరం మడికిలో దిగి అక్కడి నుంచి వేరే బస్సులో తిరిగి రావులపాలెం చేరుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణికులకు రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు సిరిపురపు శ్రీనివాసరావు, కొత్తపేట ఐటీ విభాగం అధ్యక్షుడు కొవ్వూరు సుధాకర్ రెడ్డి, కర్రి నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఉచిత బస్సు ఏది చంద్రబాబూ?