
విద్యతో పాటు వ్యాయామం అవసరం
● రాజ్యసభ సభ్యుడు బోస్
● అమలాపురం జెడ్పీ బాలుర హైస్కూల్లోక్రీడా పరికరాల ప్రారంభం
అమలాపురం టౌన్: ప్రతి విద్యార్థి చదువుతో పాటు వ్యాయామంపై శ్రద్ధ చూపేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో రూ.30 లక్షలతో అమర్చిన పలు క్రీడా పరికరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యార్థులు చదువులోనూ ప్రతిభ చూపగలరన్నారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అభ్యర్థన మేరకు తన ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలు కేటాయించి, క్రీడా పరికారాలను సమకూర్చిన ఎంపీ బోస్‌ను జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ప్రత్యేకంగా అభినందించారు. ఆ పాఠశాల క్రీడా స్థలంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సభకు ఎంపీ బోస్, జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, వైఎస్సార్ సీపీ అమలాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ అతిథులుగా హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు రోజూ వ్యాయామం అలవాటు చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులకు సూచించారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ అమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా స్థలం ప్రాధాన్యతపై అవగాహన ఉన్న ఎంపీ బోస్ రూ.30 లక్షలతో క్రీడా పరికరాలను సమకూర్చడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎంపీ బోస్ క్రీడాభిరుచితోనే క్రీడా పరికరాలను ఏర్పాటు చేశారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్, ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భమిడిపాటి రామకృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, వెటరన్ క్రీడాకారులు మెహబూబ్ సిస్టర్స్ సహీరా, షకీలా, వ్యాయామ ఉపాధ్యాయులు ఆకుల ఉమామహేశ్వరరావు, కుడుపూడి బుజ్జి పాల్గొన్నారు.