బస్‌పాస్‌లకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బస్‌పాస్‌లకు వేళాయె

Jul 8 2025 7:08 AM | Updated on Jul 8 2025 7:08 AM

బస్‌ప

బస్‌పాస్‌లకు వేళాయె

ఉచిత, రాయితీ బస్సుపాసుల

మంజూరుకు ప్రభుత్వం చర్యలు

12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు అవకాశం

రాయవరం: విద్యా సంవత్సరం పునః ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతమైంది. దూర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసే విద్యార్థులు ఉదయాన్నే కళాశాలలకు వెళ్లేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ప్రజా రవాణా శాఖ ఏటా ఉచిత, రాయితీ బస్సుపాసులను మంజూరు చేస్తుంది. 2025–26 విద్యా సంవత్సరానికి ఆర్టీసీ బస్‌పాస్‌ల జారీ ప్రారంభమైంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు 7,657 పాస్‌లు జారీ చేశారు.

చదువులకు ఊతం

జిల్లాలోని అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం ఆర్టీసీ డిపోల నుంచి విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత, రాయితీ బస్సు పాస్‌లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్‌ఆర్‌టీసీపీఏఎస్‌ఎస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల సెలవుల తర్వాత విద్యా సంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రజా రవాణా శాఖ బస్సు పాసు కౌంటర్లు ప్రారంభించింది. బస్సు రూటు ఆధారంగా రాయితీ చార్జీని నిర్ణయిస్తారు.

ఎవరెవరికి ఇస్తారంటే

12 ఏళ్ల లోపు బాలురు, 18 ఏళ్ల లోపు బాలికలకు ఉచితంగా బస్‌పాసులను జారీ చేస్తారు. ఇవి ఏడాది వరకు చెల్లుబాటు అవుతాయి. ఈ పాస్‌ల ద్వారా విద్యార్థులు తమ నివాసం నుంచి 20 కిలోమీటర్ల వరకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకుగాను విద్యార్థి ఫొటో, స్కూల్‌ యాజమాన్యం నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. మిగతా వారికి రాయితీతో బస్‌పాసులు మంజూరు చేస్తారు. పాసు ధరతో పాటు సంవత్సరం గుర్తింపు కార్డు కోసం రూ.100, నెలవారీ గుర్తింపు కార్డు రూ.50, సర్వీసు చార్జీ రూ.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రాయితీ బస్‌పాస్‌లు నెల, మూడు నెలలు, ఏడాది కాలపరిమితితో మంజూరు చేస్తారు. గడువు ముగిశాక రెన్యువల్‌ కోసం ప్రిన్సిపాల్‌ సంతకం చేయించుకుని తిరిగి పొందాల్సి ఉంటుంది. సాధారణ విద్యార్థులకు జూన్‌ నుంచి ఏప్రిల్‌ వరకు, ఐటీఐ, పారా మెడికల్‌ వంటి కోర్సులు చదివే వారికి మే నెలలో పాసులు మంజూరు చేస్తారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక స్టేజీగా పరిగణలోకి తీసుకుని దూరాన్ని బట్టి రాయితీ ఇస్తారు. రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు, అమలాపురం డిపోల నుంచి గతేడాది ఫ్రీ బస్‌పాస్‌లు, రాయితీ బస్‌పాస్‌లు, దివ్యాంగులకు 67,399 మందికి బస్‌పాస్‌లు జారీ చేశారు.

ప్రతి విద్యార్థికి రాయితీపై

ప్రతి విద్యార్థి రాయితీ బస్‌ పాస్‌ పొందవచ్చు. చార్జీలో ఒక వంతు మాత్రమే విద్యార్థి చెల్లించేలా ఈ పాస్‌లు జారీ చేస్తారు. విద్యార్థి నివాసం నుంచి 50 కిలోమీటర్ల వరకు రాయితీ పాస్‌ జారీ చేస్తారు. కళాశాల నుంచి బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. విద్యార్థి ఫొటో జత చేయాలి. విద్యార్థి నెలావారీ, మూడు నెలలకోసారి, సంవత్సరం పాస్‌లు పొందవచ్చు. మంత్లీ పాస్‌ ఐడీ కార్డులకు రూ.100 వంతున చెల్లించాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఏపీఎస్‌ఆర్‌టీసీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. కళాశాల విద్యార్థులు 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు జిరాక్స్‌ జత చేయాలి. స్టడీ సర్టిఫికెట్‌తో పాటు రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, సెల్‌ నంబర్‌ ఇవ్వాలి. దరఖాస్తులను సమీప డిపో మేనేజర్‌ పరిశీలించి పాస్‌ మంజూరుకు సిఫారసు చేస్తారు. వీటిని మంజూరు కౌంటరులో ఇచ్చి నిర్ణీత రుసుం చెల్లించి పాస్‌ పొందవచ్చు.

సద్వినియోగం చేసుకోవాలి

పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనందున బస్‌పాస్‌ల జారీ ప్రక్రియను ప్రారంభించాం. ప్రభుత్వం అందించే బస్సు పాసులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. 50 కిలోమీటర్ల పరిధి వరకు రాయితీ బస్సు పాసులు జారీ చేస్తున్నాం. సదరం సర్టిఫికెట్‌ పొందిన దివ్యాంగులకు 50 శాతం రాయితీతో బస్సు పాస్‌లు జారీ చేస్తున్నాం.

– ఎస్‌టీపీ రాఘవకుమార్‌, జిల్లా ప్రజా రవాణా అధికారి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

గతేడాది జారీ చేసిన బస్‌పాస్‌లు ఇలా

కేటగిరీ ఆఫ్‌ పాస్‌ జారీ చేసిన పాస్‌లు

12 ఏళ్ల లోపు విద్యార్థులకు ఉచిత పాస్‌లు 2,274

18 ఏళ్ల లోపు విద్యార్థినిలకు ఉచిత పాస్‌లు 8,342

విద్యార్థులకు నెలవారీ పాస్‌లు 34,210

మూడు నెలల పాస్‌లు 14,830

ఇయర్లీ పాస్‌లు 57

దివ్యాంగులకు జారీ చేసిన పాస్‌లు 1,820

మంత్లీ సీజన్‌ పాస్‌లు 5,866

బస్‌పాస్‌లకు వేళాయె1
1/1

బస్‌పాస్‌లకు వేళాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement