
సమస్యలకు సత్వర పరిష్కారం
జేసీ నిషాంతి
అమలాపురం రూరల్: అర్జీదారుల సమస్యల పట్ల సత్వరమే స్పందించి పరిష్కార మార్గాలు నూటికి నూరు శాతం సంతృప్తి కరంగా అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిషాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 290 అర్జీలను స్వీకరించారు. జేసీ మాట్లాడుతూ అర్జీదారుడి సంతృప్తి లక్ష్యంగా సమస్యను పరిష్కరించాలన్నారు. తమ ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్, 1100 కాల్ సెంటర్ ద్వారా తెలుసు కోవచ్చునన్నారు. డీఆర్‌ఓ రాజకుమారి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, డీసీహెచ్ ఎస్ కార్తీక్, డీఎంహెచ్‌వో ఎం.దుర్గారావు దొర, డీఎఫ్‌ఓ ఎంవీప్రసాద రావు, ఎస్‌డీసీ ఈ. కృష్ణమూర్తి, డీఎల్‌డీ వో రాజేశ్వరరావు డీఎస్‌ఓ ఎ.ఉదయభాస్కర్, డీపీవో శాంత లక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 24 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలపై వినతులను అందజేశారు. ఎస్పీ ప్రతి అర్జీదారునితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను విచారించారు.