
దళితులపై పెరిగిన అరాచకాలు
ఆర్‌పీఐ రాష్ట్ర అధ్యక్షుడు డీబీ లోక్ ఆందోళన
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డీబీ లోక్ ఆందోళన వ్యక్తం చేశారు. దళితులంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించాలని పిలుపునిచ్చారు. స్థానిక అరిగెలపాలెంలో సోమవారం జరిగిన ఆర్‌పీఐ ముఖ్య నాయకుల సమావేశంలో లోక్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో కుల రాక్షసి విలయ తాండవం చేస్తోందన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ దళిత బాలికపై 17 మంది అత్యాచారం చేస్తే ఇప్పటిదాకా దోషులను అరెస్ట్ చేయలేదని చెప్పారు. దోషులకు కూటమి ప్రభుత్వ పెద్దలు అండగా నిలిచారని, ఈ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి నిర్వీర్యమైందని చెప్పారు. ఇరాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో దళితులపై దాడులు, అరాచకాలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని అన్నారు. చంద్రబాబు సంపద సృష్టి, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఆర్భాట ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ప్రజా సంక్షేమం, హామీల అమలు, లా అండ్ ఆర్డన్ అనే మూడు ముఖ్యమైన విషయాలను విస్మరిస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు ఈవీవీ సత్యనారాయణ, గోసంగి ఆనందరావు, చిలకపాటి సాంబశివరావు, నాగాబత్తుల ప్రసాదరావు పాల్గొన్నారు.