
కలల తీరం చేరాలిలా..
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంచుకున్న లక్ష్యం గొప్పదే కావచ్చు.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిపై కూడా అవగాహన ఉండాలి. ఆ ప్రయాణంలో సానుకూల అంశాలు.. అవరోధాల వంటి వాటిని ముందే తెలుసుకుంటే.. అడుగు ముందుకు ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి.. ఏపీ ఈఏపీ సెట్‌లో మంచి ర్యాంకులు సాధించి.. ఇంజినీరింగ్ చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలనుకునే విద్యార్థులకు.. ఆ మార్గంలో తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్ షెడ్యూల్‌ను జూలై 1న ప్రారంభించగా ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి కళాశాలల్లో చేరాలి. దీంతో, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు హడావుడి మొదలైంది. ఇప్పటికే ఏ కోర్సు చదవాలి, ఏ కళాశాలలో చేరాలి తదితర అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్‌లో తాము ఎంచుకున్న కళాశాలకు ఆప్షన్ ఇవ్వడంపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విద్యానిపుణులు సూచిస్తున్నారు.
అందుబాటులోకి కొత్త కోర్సులు
ఇంజినీరింగ్‌లో ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్‌ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తవి కూడా అందుబాటులోకి వచ్చాయి. సీఎస్‌ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, అడ్వాన్స్‌డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్‌టైల్ వంటి కొత్త బ్రాంచ్‌లు వచ్చాయి.
ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ఇలా..
ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు cets.apsche.ap.gov.in&25 వెబ్‌సైట్‌లో అడ్మిషన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్‌లోకి ప్రవేశించాలి. అక్కడ అడిగిన సమాచారం పూర్తిగా నింపి. సబ్‌మిట్ కొట్టాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ, టీసీతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, రేషన్ కార్డులను అప్‌లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి గత ప్రభుత్వం 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి.
ఏపీ ఈఏపీ సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు
కాకినాడ 6,343
కోనసీమ 2,868
తూర్పు గోదావరి 6,011
మొత్తం 15,222
నేటి నుంచి ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్
కాకినాడలో 2 హెల్ప్‌లైన్ కేంద్రాలు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యావేత్తలు
స్వయంగా చూసుకోవడం మేలు
వెబ్ కౌన్సెలింగ్ సందర్భంగా రిజిస్టేషన్ దగ్గర నుంచి ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటివి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరికి వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. ఎవరైనా స్నేహితుల ద్వారానో మరొకరితోనే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేయిస్తే అనేక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బంది విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల ఆప్షన్, కోర్సు వారే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ దశ చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందాలి. వెబ్ కౌన్సెలింగ్ విద్యార్థి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనే పూర్తి బాధ్యుడు అవుతాడు.
– ఎన్.రామకృష్ణయ్య, సీఎస్‌ఈ ప్రొఫెసర్, జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్ కళాశాల
ఆసక్తి ఉన్న బ్రాంచ్‌నే ఎంచుకోవాలి
విద్యార్థులు కళాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచ్‌నే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్ అనే భావన నుంచి బయట పడి, ఏ కోర్సుకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుకోవాలి. అందుకు తగిన బ్రాంచ్ ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరి కాదు. ఇటీవల సాఫ్ట్‌వేర్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సీఎస్‌ఈ కోర్సు ఒక్కటే ప్రాధాన్యమున్నది కాదనేది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి.
– డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, మెకానికల్ ప్రొఫెసర్, జేఎన్‌టీయూకే ఇంజినీరింగ్ కళాశాల

కలల తీరం చేరాలిలా..

కలల తీరం చేరాలిలా..