
ఇంటి బాట నుంచి పోరుబాటకు..
● రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు
● కూటమి ప్రభుత్వం నిర్ణయంతో అవస్థలు
కొత్తపేట: ఇంటింటికీ రేషన్ సరకులు అందించే ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది.. ఈ నిర్ణయంతో జిల్లాలో 710 మంది మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు, హెల్పర్లను ఉపాధి కోల్పోయారు. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరుబాటకు సిద్ధమవుతామని జిల్లాలోని ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు హెచ్చరిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2021లో ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,260 ఎండీయూలను తీసుకుని ఒక్కో వాహనానికి ఇద్దరు చొప్పున మొత్తం 18,520 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ జీఓ జారీ చేసింది. నాటి నుంచి నేటి వరకూ ఇంటి వద్దకే రేషన్ సరకులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో అనేక మంది ఆపరేటర్లు, హెల్పర్లు వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడ్డారు. 2027 జనవరి వరకూ అగ్రిమెంట్ ఉండగా, కేవలం వైఎస్సార్ సీపీ హయాంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారనే సాకుతో కక్షగట్టి, 20 నెలల మందుగానే ఎండీయూ వ్యవస్థ రద్దుకు ఈ నెల 20న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 355 ఎండీయూ వాహనాలకు సంబంధించి 355 మంది ఆపరేటర్లు, 355 మంది హెల్పర్లు పని చేస్తుండగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి కోల్పోనున్నారు.
వారి డిమాండ్లు ఇవీ..
ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలించి, ఈ కాలవ్యవధి ఉన్నంత వరకూ ఎండీయూ ఆపరేటర్లను కొనసాగించాలి. లేదా తమ సేవలను వేరే శాఖలకు మార్చాలి. కార్మిక చట్టం కింద ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వకుండా , ముందస్తు సంప్రదింపులు లేకుండా తమను విధుల నుంచి తొలగించినందుకు తగిన నష్ట పరిహారాన్ని చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లకు మద్దతు ఇవ్వాలని కోరుతూ అధికార, ప్రతిపక్ష నాయకులకు వినతిపత్రాలు సమర్పించారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎండీయూ వ్యవస్థ ద్వారా కరోనా కాలంలోనూ ప్రాణాలు సైతం పణంగా పెట్టి సేవలు అందించాం. ఈ వ్యవస్థ ద్వారా జీవనోపాధి పొందుతున్నాం. ఇప్పుడు అర్ధాంతరంగా వ్యవస్థను రద్దు చేసి, మా జీవనోపాధికి గండి కొట్టడం ప్రభుత్వానికి భావ్యం కాదు. పునరాలోచించి ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లకు న్యాయం చేయాలని కోరుతున్నాం.
– బొంతు రామదాసు, అధ్యక్షుడు, జిల్లా
ఎండీయూ ఆపరేటర్ల యూనియన్, అయినవిల్లి

ఇంటి బాట నుంచి పోరుబాటకు..