
‘సూపర్ సిక్స్’ అమలు ఎక్కడో?
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్
ప్రధాన కార్యదర్శి కిషోర్
అమలాపురం టౌన్: పేదలకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా, 2029 నాటికి పేదరికాన్ని ఎలా నిర్మూలిస్తారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి తెన్నేటి కిషోర్ అన్నారు. సంపద సృష్టిస్తానని, పేదరికాన్ని నిర్మూలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా సూపర్ సిక్స్ అమలు చేయలేనప్పుడు అవి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఆదివారం అమలాపురంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని అంతం చేస్తానన్న చంద్రబాబు చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని కిషోర్ అన్నారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధాని మోదీని పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాల కల్పన గురించి అడిగారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి అడగలేదని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు, ఎగుమతులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన దానంతటికవే వస్తాయన్న విషయాన్ని చంద్రబాబు విస్మరించి ఎంత సేపూ మోదీని పొగడడం, ఏవేవో కోరడంతోనే సరిపోతోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వెనకబడుతోందన్నారు.
బాలాజీ స్వామి
కల్యాణోత్సవాలకు శ్రీకారం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. వైశాఖ మాసం, కృష్ణ పక్షం, త్రయోదశి, అశ్వని నక్షత్రం శుభ ముహూర్తంలో పందిరి రాట వేసి ముహూర్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో దిగ్విజయంగా జరిపించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు పందిరి రాటకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా జరగాలని అభిలాషిస్తూ పందిరి రాట పాతారు. జూన్ 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు జరుగుతాయని ఈఓ తెలిపారు. 6వ తేదీ రాత్రి 9.15 గంటలకు స్వామివారి వార్షిక కల్యాణం ఉంటుందన్నారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి, సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. అలాగే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలోని 22 మండల కేంద్రాలు, 4 మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్జీదారులు ఆయా స్థాయిల్లో తమ సమస్యలపై అర్జీలు అందించవచ్చన్నారు. 1100 కాల్ సెంటర్ ద్వారా తమ ఫిర్యాదులను తెలపవచ్చని ఆయన చెప్పారు.
రేపు నిధి ఆప్ కే నికట్
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటలకు నిధి ఆప్ కే నికట్ – డిస్ట్రిక్ట్ ఔట్ రీచ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ రాధానాథ్ పట్టానాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి చెల్లూరు సర్వారాయ షుగర్స్‌లో, కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి పీఏసీఎస్(సొసైటీ)లో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వెంకటరామ పీఏసీఎస్(సొసైటీ)లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపెండెంట్ పేరెంట్ పెన్షన్, పెన్షనర్లు మరణిస్తే ఏంచేయాలి, పెన్షన్ ప్రయోజనాల కోసం అర్హత అండ్ డీఎస్‌సీ, ప్రయాస్ – పదవీ విరమణ రోజున పీపీఓ, పెన్షన్ అండ్ ఈడీఎల్‌ఐ కాలిక్యులేటర్‌పై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్లు, కొత్తగా కవర్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్లు ఈ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించుకోవాలని అభ్యర్థిస్తున్నామన్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ బకాయి ఉన్న పింఛనుదారులు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఈ క్యాంపును సందర్శించాలన్నారు.

‘సూపర్ సిక్స్’ అమలు ఎక్కడో?