
ఏడాది కాలంలో ఏం పొడిచారు?
● ఫ్లెక్సీలు కట్టి డబ్బాలు కొట్టుకోవడం
తప్ప ఏం చేశారు?
● అసలు బాబూకొడుకులకేం తెలుసు?
● నా చరిత్ర తెలియకుండా ఏదో మాట్లాడుతున్నారు
● ఆదిరెడ్డి కుటుంబంపై గోరంట్ల ఫైర్
రాజమహేంద్రవరం రూరల్: ‘‘బుచ్చయ్య చౌదరి ఒక చరిత్ర. నా చరిత్ర తెలియనివారు ఏదో మాట్లాడుతున్నారు. రాజమండ్రి నగరం అభివృద్ధి నుంచి నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఏడాది కాలంగా బాబూ కొడుకులు ఏం చేశారు? నగర అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏడాదిగా ఏం పొడిచారు? ఫ్లెక్సీలు కట్టుకుని డబ్బాలు కొట్టుకోవడమే చేశారు. మోరంపూడి ఫ్లై ఓవర్‌కు ఏం చేశారని ఫ్లెక్సీలు కట్టుకున్నారు? నన్ను అవమానపరచాలంటే తాతలు దిగి రావాలి’’ అంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైరయ్యారు. నగరంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన సొంత పార్టీ టీడీపీకే చెందిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు. రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటును ఆదిరెడ్డి వాసు తన ఘనతగా చెప్పుకోవడంపై మండిపడ్డారు. తెలుగు విశ్వ విద్యాలయం భూముల కేటాయింపులో తాను భాగస్వామినని, రాష్ట్ర విభజన తరువాత తెలుగు విశ్వ విద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వడానికి కేసీఆర్ మొండికేశారని, దీని కోసం 2014–19 మధ్య అనేకసార్లు చంద్రబాబుతో తాను మాట్లాడానని చెప్పారు. వాసు వ్యవహారం చూస్తూంటే.. ఎవరో కన్న బిడ్డకు తాను తండ్రిగా చెప్పుకున్నట్లు ఉందని దుయ్యబట్టారు. సుబ్రహ్మణ్యం మైదానంలో సభ ఏర్పాటు చేసి, తాను చేసిన అభివృద్ధిని సవివరంగా చెబుతానని గోరంట్ల అన్నారు.
తారస్థాయికి చేరిన రాజకీయ వైరం
టీడీపీలో గోరంట్ల, ఆదిరెడ్డి మధ్య చిరకాలంగా నెలకొన్న రాజకీయ వైరం ప్రస్తుతం తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. పార్టీకి అత్యంత కీలకమైన మహానాడుకు ముందే వారి మధ్య వైరుధ్యాలు వెలుగు చూశాయి.