
● ‘ఆడుదాం ఆంధ్రా’కు
నాణ్యమైన స్పోర్ట్స్ కిట్‌లు
● జిల్లాలో 515 సచివాలయాలకు
అందజేత
● బాల్స్, బ్యాట్‌లు, ప్యాడ్‌లు,
స్టంప్స్ తదితరాల పంపిణీ
● ఈ నెల 15 నుంచి క్రీడా పోటీలు
● పక్కాగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
సాక్షి, అమలాపురం: కలలను నిజం చేసుకునే అవకాశమిది.. ప్రతిభ ఉంటే విజయ తీరాలకు చేరే సమయమిది.. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది.. ఇందులో భాగంగా ‘ఆడుదాం– ఆంధ్రా’ మెగా క్రీడా ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తోంది.. దీనికోసం ఇప్పటికే చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి పోటీలకు అంకురార్పణ జరుగనుంది. ఇప్పటికే ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల నిర్వహణకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించింది. క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం భారీ నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటు విజేతలకు సర్టిఫికెట్లు, మెమెంటోలు, నగదు పురస్కారాలు అందించి సత్కరించనుంది. 15 ఏళ్లు పైబడిన వయసున్న బాల, బాలికలందరినీ ఈ పోటీల్లో భాగస్వాములను చేస్తోంది. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. జిల్లాలోని 467 గ్రామ, 48 వార్డు సచివాలయాల్లో తొలిదశలో ఈ పోటీలు జరగనున్నాయి. వీటి నిర్వహణ, క్రీడాకారుల వినియోగించేందుకు ప్రత్యేకంగా నాణ్యమైన స్పోర్ట్స్ కిట్‌లను ప్రభుత్వం అందజేస్తోంది. సచివాలయ, మండల స్థాయిలో పోటీల నిర్వహణకు బేసిక్ కిట్, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే వారికి ప్రొఫెషనల్ కిట్ సమకూర్చుతోంది. జిల్లాలో బేసిక్ కిట్లు ఇప్పటికే సచివాలయాలకు అందజేసింది. వీటిని ఆయా సచివాలయాల నుంచి పాల్గొనే జట్లకు ఇస్తోంది. నియోజకవర్గ స్థాయి పోటీల ఆరంభానికి ముందు ప్రొఫెషనల్ కిట్‌లు అందజేయనున్నారు.
అత్యాధునిక పరికరాలు
ఆడుదాం ఆంధ్రా పోటీల నిర్వహణకు ప్రభుత్వం పంపిన క్రీడా కిట్ అత్యాధునిక ప్రమాణాలతో ఉంది. నాణ్యమైన పరికరాలను చూసి క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాలీబాల్, షటిల్ ర్యాకెట్‌లు, క్రికెట్ బ్యాట్‌లు, స్టంప్‌లు, బెయిల్స్, కీపింగ్ గ్లౌస్ చాలా బాగున్నాయని అంటున్నారు. గతంలో క్రీడా క్లబ్‌లకు, పాఠశాలలకు గత ప్రభుత్వం క్రీడా పరికరాలు అందజేసినా ఇంత పెద్దఎత్తున అందించడం కాని, ఈ స్థాయిలో నాణ్యత పరికరాలు ఇచ్చిన సందర్భాలు లేవు. ఇప్పుడు సచివాలయ స్థాయిలో కిట్‌లు ఇవ్వడం పట్ల క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయవంతంగా
క్రీడలు నిర్వహిస్తాం..
సచివాలయ, మండల స్థాయి పోటీలు నిర్వహించేందుకు వీలుగా బేసిక్ స్పోర్ట్స్ కిట్‌లను అందజేస్తున్నాం. జిల్లాలోని అన్ని సచివాలయాలకు వీటిని పంపించాం. ఆడుదాం ఆంధ్రా పోటీలను జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అంతా సమన్వయంతో పనిచేస్తున్నాం.
– పీఎస్ సురేష్‌కుమార్,
చీఫ్ కోచ్, జిల్లా క్రీడాప్రాధికార సమితి
బేసిక్ కిట్ (సచివాలయ, మండల స్థాయి పోటీలకు..)
వాలీబాల్ : నెట్–1, వాలీబాల్‌లు : 3
షటిల్ బ్యాడ్మింటన్ : షటిల్ ర్యాకెట్‌లు– 6, నైలాన్ షటిల్ బ్యారల్స్–3, నెట్–1
క్రికెట్ : పురుషుల జట్టుకు –2 కిట్‌లు, మహిళల జట్టుకు – ఒక కిట్
కిట్‌లో ఉండేవి: బ్యాట్‌లు– 2, స్టంప్‌లు–6, బెయిల్స్–4,
కీపింగ్ గ్లౌజు–1, టెన్నిస్ బాల్‌లు–6
టెన్నికాయిట్ : రింగులు –2 (రిక్రియేషన్ క్రీడలకు)
ప్రొఫెషనల్ కిట్ (నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు..)
వాలీబాల్ : వాలీబాల్‌లు –4
షటిల్ బ్యాడ్మింటన్ : షటిల్ ర్యాకెట్‌లు– 8, ఫెదర్ షటిల్ బ్యారల్స్–10
ఖోఖో : యాంకిల్ క్యాప్‌లు– ప్రతి క్రీడాకారునికి రెండు
కబడ్డీ : నీ క్యాప్‌లు – ప్రతి క్రీడాకారునికి రెండు
క్రికెట్ : పురుషుల జట్టుకు –2 కిట్‌లు, మహిళల జట్టుకు – ఒక కిట్
కిట్‌లో ఉండేవి: లెదర్ బాల్స్–2, ప్యాడ్‌లు– 4,
బ్యాటింగ్ గ్లౌజులు–2 పెయిర్‌లు, కీపింగ్ గ్లౌజులు–1, స్టంప్స్– 6,
బెయిల్స్–2, అబ్డర్మ్‌స్ ప్యాడ్‌లు–2, ఎల్బో గార్డ్స్–2, థైఫాడ్స్–2,
చెస్ట్ గార్డ్స్–2, కీపింగ్ ప్యాడ్స్– ఒక పెయిర్, స్టంప్– 6,
బెయిల్స్–4, కీపింగ్ గ్లౌజు–1, టెన్నిస్ బాల్స్–6

