
పాశర్లపూడిలంకలో డ్రిల్లింగ్ పరిశోధనలు
మామిడికుదురు: పాశర్లపూడి ఓఎన్జీసీ స్ట్రక్చర్ పరిధిలోని పాశర్లపూడిలంకలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పరిశోధనలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న సైటులోనే తాజాగా ఈ ప్రక్రియ నిర్వహిస్తుంది. ఓఎన్జీసీకి చెందిన ఈ–2000–3 నంబర్ రిగ్‌తో ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు. డీవియేషన్ ప్రక్రియ (క్రాస్) డ్రిల్లింగ్ ద్వారా వైనతేయ గోదావరి నదీ అంతర్భాగంలో చేస్తున్నారు. సుమారు 2,910 మీటర్ల లక్ష్యం మేర డ్రిల్లింగ్ నిర్వహించాల్సి ఉండగా, సుమారు 1,900 మీటర్ల వరకూ జరిగిందని ఓఎన్జీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న సైటులో రెండు బావుల నుంచి సహజ వాయువు ఉత్పత్తి అవుతోంది. మరో బావిలో ఉత్పత్తి నిలిచిపోయింది. అదే సైటులో నాల్గవ బావిలో డ్రిల్లింగ్ చేపట్టారు. కొత్త జోన్ల నుంచి నిక్షేపాలను చేజిక్కుంచుకోవాలన్న లక్ష్యంతో ఈ పరిశోధనలు చేస్తున్నారు. పాశర్లపూడి స్ట్రక్చర్ పరిధిలోని పలు బావుల నుంచి ఇప్పటికే ఆశాజనకంగా సహజ వాయువు లభ్యమవుతోంది.
వాడపల్లి వెంకన్నకు పంచ పాత్రల సమర్పణ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి మాజీ ఎమ్మెల్యే మంతెన వెంకట సూర్యసుబ్బరాజు (ఎంవీఎస్ సుబ్బరాజు) కుటుంబ సభ్యులు ఐదు బంగారు పంచ పాత్రలు సమర్పించారు. ఎంవీఎస్ కుమారుడు, పారిశ్రామికవేత్త ఎంవీ కృష్ణంరాజు, దుర్గావతి దంపతులు, వారి కుమారుడు వెంకటసూర్య సుబ్బరాజు, శ్వేత దంపతులు, కుటుంబ సభ్యులు సోమవారం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి పూజా కార్యక్రమాల నిమిత్తం ప్రత్యేకంగా 209.084 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఐదు పంచపాత్రలు, 318 గ్రాముల వెండి కంచం దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు వేదాశీర్వచనం గావించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ప్రశాంతంగాఏపీ ఈఏపీ ప్రవేశ పరీక్ష
రాయవరం: జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ ఈఏపీ సెట్) ప్రవేశ పరీక్ష సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అమలాపురం మండలం భట్లపాలెం ఇంజినీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం చెయ్యేరు పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్ష జరిగింది. ఉదయం, మధ్యాహ్నం సెషన్స్‌లో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 94.52 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు 803 మంది హాజరు కావాల్సి ఉండగా 759 మంది వచ్చారు. ఆన్‌లైన్ విధానంలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్‌లో 372 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 387 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగిందని ఏపీ ఈఏపీ సెట్ రాష్ట్ర కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 23 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదులు చేశారు.
గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు చొరవ చూపాలని ఎస్పీ ఆదేశించారు. వచ్చిన 23 అర్జీల్లో కొన్ని ఆస్తి, కుటుంబ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఈ తరహా అర్జీదారులతో ఎస్పీ కృష్ణారావు చర్చించి పరిష్కారానికి సూచనలు చేశారు.
పాశర్లపూడిలంకలో
నిర్వహిస్తున్న
డ్రిల్లింగ్
పరిశోధనలు

పాశర్లపూడిలంకలో డ్రిల్లింగ్ పరిశోధనలు