
రాజోలు టీడీపీలో ఇన్‌చార్జి రగడ
ఫ గుబ్బలకు చెక్ పెడుతూ
ఎస్సీల సమావేశం
ఫ పదవి కోసం పావులు కదుపుతున్న జగడం, గెడ్డం
మలికిపురం: రాజోలు నియోజకవర్గంలోని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కూటమి నుంచి జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అతీగతీ లేకుండా ఉన్నామని టీడీపీ క్యాడర్ అసంతృప్తితో ఉండగా.. గత కొంత కాలంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పదవిపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సోమవారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో నియోజకవర్గ టీడీపీ ఎస్సీ విభాగం సమావేశాన్ని గోనిపాటి రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నికల తరువాత ఒక నాయకత్వం లేకుండా ఉన్న టీడీపీకి ఇన్‌చార్జిని వెంటనే నియమించాలని కోరుతూ తీర్మానం చేశారు. పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర నాయకుడిగా ఉన్న గెడ్డం సింహాను ఇన్‌చార్జిగా నియమించాలని తీర్మానించారు. అయితే ఈ పదవి కోసం ఆ పార్టీలోని అదే సామాజికవర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు రాజోలుకు చెందిన జగడం సత్యనారాయణ కూడా కర్చీఫ్ వేశారు. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇటీవల వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును టీడీపీలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించుకుని జనసేన ఎమ్మెల్యేకు ధీటుగా పెట్టుకుందామని టీడీపీలో ఒక వర్గం పావులు కదపగా, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా నియోజకవర్గ టీడీపీ ఎస్సీ విభాగం అత్యవసరంగా సమావేశం కావడం వెనుక ఆ పార్టీలో ఉన్న తీవ్ర అసంతృప్తే కారణమని తెలుస్తోంది. రాజోలు నియోజకవర్గం నుంచి ధవళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌గా ఉన్న గుబ్బల శ్రీనివాస్‌ను నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఖరారు చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ధీటుగా ఎస్సీ నియోజకవర్గమైన రాజోలుకు బీసీ ఇన్‌చార్జి ఏంటనే విధంగా తాజాగా ఎస్సీ విభాగం సమావేశం తీర్మానం చేసింది. ఇందులో భాగంగా గెడ్డం సింహాను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించాలని చేసిన తీర్మానం కాపీలను పార్టీ అధిష్టానానికి పంపుతున్నట్లు సోమవారం సమావేశంలో నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.