
ప్రాధాన్యానికి చెల్లుచీటీ!
ఫ సొమ్ము చెల్లింపుల్లో తీవ్ర జాప్యం
ఫ 24 గంటల్లో ఇస్తామని
ప్రభుత్వం హడావుడి
ఫ తొలుత 24 నుంచి 36 గంటల్లో
చెల్లింపులు
ఫ ఇప్పుడు రోజుల పాటు లేటు
ఫ ఇబ్బందులు పడుతున్న రైతులు
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వం చెప్పే మాట, చేసే పని వేరవుతోంది.. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము వేస్తామని గొప్పలకు పోయింది. రైతుల చెవుల్లో హోరెత్తించేలా ప్రచారం చేసింది. నిజమే అన్నట్టుగా రబీ ధాన్యం కొనుగోలు చేసిన తొలి రోజుల్లో సొమ్ము జమ చేసింది. ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు పెరిగిందో రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము 24 గంటల్లో దేవుడెరుగు, రోజుల తరబడి పెండింగ్‌లో పెడుతూ వస్తోంది.
జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు విషయంలోనే కాదు.. కొన్న ధాన్యానికి ఇవ్వాల్సిన సొమ్ము విషయంలోనూ కూటమి ప్రభుత్వం రైతుల వద్ద మాట తప్పింది. ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు సరికాదా.. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేస్తామనే మాటనూ పక్కనబెట్టింది. జిల్లాలో గత ఏప్రిల్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు మొదలు కాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 334 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకూ కేవలం 2.21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించి జిల్లాలో 24,288 మంది రైతులకు రూ.503 కోట్ల వరకూ నగదు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.270 కోట్లు మాత్రమే చెల్లించింది. మరో రూ.60 కోట్ల బిల్లులకు సంబంధించి బ్యాంకు క్లియరెన్స్‌కు పంపించింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి సమయంలో ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమవుతాయని పౌరసరఫరా శాఖ జిల్లా మేనేజర్ ఎం.బాల సరస్వతి శ్రీసాక్షిశ్రీకి తెలిపారు. మిగిలిన సొమ్మును కూడా అతి త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే రైతులకు ఇంకా రూ.173 కోట్ల ధాన్యం సొమ్మును ప్రభుత్వం చెల్లించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సొమ్ము ఇప్పుడప్పుడే పడే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించిన సమయంలో 24 గంటల నుంచి 36 గంటల్లోపు సొమ్ము జమచేసింది. అది చాలా తక్కువ మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో మాత్రమే. కొనుగోలు పరిమాణం పెరిగిన తరువాత సొమ్ము చెల్లింపులను పెండింగ్‌లో పెట్టింది. అయితే ఈ చెల్లింపులు ఈ నెల 9వ తేదీ నుంచి నిలిచిపోయిన విషయం ఇక్కడ గమనార్హం. అప్పటి నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అరకొరగా సొమ్ము చెల్లిస్తున్నారు.
సొమ్ములు లేవంట..
కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆకాశమే హద్దుగా అప్పులు చేస్తోంది. పింఛన్ల పెంపు తప్ప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేసిన దాఖలాలు లేవు. రైతులకు ఏడాదికి ఇస్తానన్న రూ.20 వేల అన్నదాత సుఖీభవ సొమ్మును తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టిన విషయం తెలిసిందే. పోనీ రబీలో పండించిన ధాన్యం అయినా కొంటుందా అంటే అదీ లేదు. రైతులకు చెల్లించాల్సిన ధాన్యం బకాయిలకు ప్రభుత్వం వద్ద సొమ్ము లేదని తెలుస్తోంది. రైతులు పండించిన ప్రతి గింజా ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తే చెల్లింపుల ఆలస్యం అవుతాయనే కారణంతోనే కూటమి ప్రభుత్వం ధాన్యం లక్ష్యాన్ని కుదించిందని రైతులు ముందు నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం జిల్లాలో పండించిన పంటలో కొనుగోలు లక్ష్యాన్ని సగానికి కుదించింది. అధికారుల లెక్కల ప్రకారం 1.68 లక్షల ఎకరాల్లో రబీసాగు జరగ్గా, 5.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోందని అంచనా వేశారు. వాస్తవంగా దిగుబడి ఇంతకన్నా అధికంగా ఉంటోందని ఆయకట్టు రైతులు చెబుతున్న విషయం తెలిసిందే. అయినా తొలుత కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు మాత్రమే అనుమతి మంజూరు చేసింది. రైతుల నుంచి విమర్శలు రావడం, వైఎస్సార్ సీపీ ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో కొనుగోలును మరో లక్ష టన్నులకు పెంచింది.
దీనిలో కూడా కొన్నది మూడింట రెండో వంతు అయ్యింది. దానిలో ఇచ్చిన సొమ్ము కొనుగోలు చేసిన ధాన్యం విలువలో సగానికి కొంత ఎక్కువే. రబీ ధాన్యం కొనుగోలు చేయడంలో కాని, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి హామీ ఇచ్చిన మేరకు 24 గంటల్లో సొమ్ము చెల్లింపుల విషయంలో గాని కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనే విమర్శలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఇలా సొమ్ము ఆలస్యం చేయడం వల్ల రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు, మిల్లర్లకు అయినకాడకు అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోంది. దీని వల్ల రైతు 75 కిలోల బస్తాకు రూ.150 నుంచి రూ.225 నష్టపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.

ప్రాధాన్యానికి చెల్లుచీటీ!