నయా దొంగలు సెల్‌ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు | Sakshi
Sakshi News home page

Cell Phone Tower: నయా దొంగలు సెల్‌ టవరే లక్ష్యం.. అక్కడ ఏముంటుందని అనుకోవద్దు

Published Thu, Sep 30 2021 11:48 AM

Two Arrest On The Case Of Cell Phone Tower Batteries Theft In Kodad - Sakshi

కోదాడ రూరల్‌: సెల్‌ టవర్‌ టెక్నీషియన్‌లుగా పనిచేస్తూ టవర్‌లలో ఉండే బ్యాటరీలను చోరీ చేసి సొమ్ము చేసుకుంటున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో  బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన దీగుంట్ల లక్ష్మీనారాయణ, కోదాడ మండలం గుడిబండకు చెందిన బెజవాడ అశోక్‌కెడ్డి, చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన గన్నా భాస్కర్‌ కొన్నేళ్లుగా జియో టవర్‌ టెక్నీషియన్‌లుగా పనిచేస్తున్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దుర్భుద్ధితో టవర్‌లకు ఎవరూ కాపలా ఉండకపోవడంతో బ్యాటరీలు దొంగతనం చేయాలని పథకం రచించారు.

ఈ మేరకు సెప్టెంబర్‌ 2019 నుంచి ఈ నెల వరకు కోదాడ పట్టణం, రూరల్‌ పరిధితో పాటు మునగాల, మఠంపల్లి, చిలుకూరు, మేళ్లచెర్వు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని పలు టవర్‌లలో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా బుధవారం తెల్లవారుజామున పట్టణ పరిధిలోని మేళ్లచెర్వు రోడ్డు ఫ్లైఓవర్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో బ్యాటరీలు తరలిస్తూ ఈ ముగ్గురు పట్టుబడ్డారు.

వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో ముగ్గురితో కలిసి దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు ఆటోలు, ఒక వ్యాన్, రూ.2 లక్షలు, 5 బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పట్టణ సీఐ ఏ. నర్సింహరావు, ఎస్‌ఐ రాంబాబు, రూరల్‌ ఎస్‌ఐ వై. సైదులు, చిలుకూరు ఎస్‌ఐ నాగభూషణరావు, సిబ్బందిని ఎస్పీ భాస్కరన్‌ అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement