మన్యంలో ఆ ఇద్దరిదీ హత్యే?

Srikakulam: Police Investigate Assassination Case In Mayam - Sakshi

దర్యాప్తులో వెల్లడైన వాస్తవం    

పోలీసుల అదుపులో అనుమానితులు

సాక్షి,సీతంపేట(శ్రీకాకుళం): మన్యంలో కొద్దిరోజుల కిందట సంభవించిన సవర గయా, సవర సింగన్నల మృతిపై పోలీసు, రెవెన్యూ అధికారులు మంగళవారం దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో గతనెల 27న గయ, 29న సింగన్నలు హత్యకు గురయ్యారని  ప్రాథమికంగా గుర్తించారు. పాలకొండ సీఐ శంకరరావు, మండల మెజిస్ట్రేట్‌ హోదాలో తహసీల్దార్‌ ఎస్‌.నరసింహమూర్తి, ఆర్‌ఐ వెంకటేష్,లతో కూడిన బృందం ఉసిరికిపాడు, రేగులగూడ గ్రామాలకు వెళ్లి వారిని దహనం చేసిన శ్మశాన ప్రాంతాలను పరిశీలించి పంచనామా చేసిన అనంతరం గ్రామస్తులను విచారణ చేశారు.

ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు  సీఐ తెలిపారు. రెండు గ్రామాల్లో పూర్తిస్థాయిలో విచారణ చేశామన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, ఎవరెవరిని అరెస్టు చేశామన్నది సమగ్రంగా బుధవారం తెలియజేస్తామని చెప్పారు. గ్రామాలను సందర్శించిన వారిలో దోనుబాయి, పాలకొండ, బత్తిలి ఎస్సైలు కిశోర్‌వర్మ, ప్రసాద్, అనిల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top