సొంత అక్క కుమారుడే రోకలితో తలపై బాదడంతో..

Son  Brutally Murdered  His aunt in Warangal District - Sakshi

సాక్షి, హసన్‌పర్తి(వరంగల్‌ అర్బన్‌): హసన్‌పర్తి మండలం పెంబర్తిలో మంగళవారం రాత్రి హత్య జరిగింది. సొంత అక్క కుమారుడే రోకలితో తలపై బాదడంతో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు... పెంబర్తికి చెందిన కనుకయ్య సొంత అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నాడు. సింగరేణిలో విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవల ఉద్యోగ పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇద్దరు భార్యలు ప్రవీణ, విజయ(55)తో కలిసి పెంబర్తిలో ఉంటున్నాడు. అయితే, చిన్న భార్య విజయ ఇటీవల కనుకయ్య పేరిట నల్లబెల్లిలో ఉన్న ఆస్తిని విక్రయించి నగదు ఆమె కుమారుడికి ఇచ్చింది.

దీంతో ప్రవీణ కుమారుడు వేణుగోపాల్‌ ఆ డబ్బులో తనకు వాటా ఇవ్వాలని కొంతకాలంగా పిన్నితో గొడవ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదేక్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. ఈ మేరకు ఆవేశంతో వేణుగోపాల్‌ ఇంట్లోని రోకలితో విజయ తలపై బాదగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు, ఎస్సై జితేందర్‌రెడ్డి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top