లుథియానా కోర్టు పేలుడు కేసు... జర్మనీలో సూత్రధారి పట్టివేత

Sikhs For Justice member arrested in Germany for Ludhiana blast - Sakshi

న్యూఢిల్లీ: లూథియానా జిల్లా కోర్టులో సంభవించిన బాంబు పేలుడు దర్యాప్తులో లోతుల్లోకి వెళ్లి కూపీ లాగిన భారత దర్యాప్తు సంస్థలు సూత్రధారిని పట్టుకోవడంలో సఫలమయ్యాయి. వేర్పాటువాద కార్యకలాపాలను ప్రోత్సహించే సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) సంస్థకు చెందిన ఉగ్రవాది జస్విందర్‌ సింగ్‌ ముల్తానీని భారత నిఘా వర్గాల సమాచారంతో జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 23న లూథియానా కోర్టు రెండో అంతస్తులో బాంబు పేలిన విషయం తెల్సిందే. మాజీ కానిస్టేబుల్‌ గగన్‌దీప్‌  బాంబును అమర్చుతుండగా పేలి అతను మరణించాడు.

ఎన్నికల వేళ పంజాబ్‌లో శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు పాకిస్తాన్‌ గడ్డపై నుంచి ఖలిస్థాన్‌ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలియడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు దీన్ని సీరియస్‌గా తీసుకొన్నాయి. గగన్‌దీప్‌... జస్విందర్‌ సింగ్‌ ముల్తానీతో నిరంతరం సంప్రదింపులు జరిపాడని గుర్తించాయి. దాంతో ఇతనిపై పంజాబ్‌ రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. భారత్‌ తమ రాయబార కార్యాలయం ద్వారా జర్మనీ పోలీసులకు తగిన ఆధారాలను సమర్పించడంతో వారు ఎర్‌ఫర్ట్‌ పట్టణంలో ముల్తానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మరిన్ని పేలుడు పదార్థాలు, హ్యాండ్‌ గ్రెనేడ్లను పాక్‌ మీదుగా భారత్‌లోకి పంపే ప్రయత్నాల్లో ముల్తానీ ఉన్నాడని, పంజాబ్‌లో మళ్లీ పేలుళ్లకు కుట్ర చేస్తున్నాడని భారత ఏజెన్సీలు గుర్తించాయి. ఖలిస్థానీ అగ్రనేతలతో ముల్తానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top