మౌన శిల్పం: ప్రశ్నలడిగితే ‘మైగ్రేన్‌’.. ఆకలేస్తే బిర్యానీ

Shilpa Chaudhary Police Custody Ended - Sakshi

రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. 
 
సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశ చూపి సంపన్న మహిళల నుంచి రూ. కోట్లు దండుకున్న కేసులో అరెస్టయిన శిల్పాచౌదరి పోలీసులకు కస్టడీలో చుక్కలు చూపింది. రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ఐదు రోజులపాటు ప్రశ్నించినా బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బును ఏం చేసిందో మాత్రం ఆమె బయటపెట్టలేదు. ఎంత అడిగినా మౌనం దాల్చింది. గట్టిగా ప్రశ్నించగా తనకు అనారోగ్యంగా ఉందని, మనోవేదనకు గురిచేస్తే మైగ్రేన్‌ వస్తుందని పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఒక సందర్భంలోనైతే పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగినట్లు సమాచారం.

పోలీసు కస్టడీకి చివరి రోజైన ఆదివారం నార్సింగి పోలీసులు, స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీం (ఎస్‌ఓటీ) శిల్పాచౌదరిని ప్రశ్నిస్తుండగా మధ్యాహ్న వేళ తనకు ఆకలిగా ఉందని, బిర్యానీ కావాలని ఆమె డిమాండ్‌ చేసినట్లు తెలియవచ్చింది. దీంతో పోలీసులు నార్సింగిలోని ఓ హోటల్‌ నుంచి చికెన్‌ బిర్యానీ తీసుకొచ్చి శిల్పకు ఇచ్చినట్లు తెలిసింది. ఆదివారంతో ఆమె కస్టడీ ముగిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆమెను కోర్టుకు తరలించనున్నారు. తమ క్లయింట్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ శిల్ప తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ వేశారు.  (ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు)

50 శాతం సొమ్ము తిరిగిచ్చేశా.. 
దీవానోస్‌ పేరిట క్లబ్‌ ఏర్పాటు చేసి సంపన్న మహిళలను కిట్టీ పార్టీలకు ఆహ్వానించిన శిల్ప... తనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఉందని, అందులో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బు ఇస్తానని నమ్మించి వందలాది మంది మహిళల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. శిల్పాచౌదరికి రూ. 1.05 కోట్లు ఇస్తే తిరిగి ఇవ్వకపోవటమే కాకుండా బౌన్సర్లతో బెదిరిస్తోందంటూ పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి నార్సింగి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటపడింది.

శిల్పాచౌదరికి రూ.2.9 కోట్లు ఇచ్చి మోసపోయానని సూపర్‌స్టార్‌ కృష్ణ కుమార్తె ప్రియదర్శిని, రూ. 3.1 కోట్లు ఇస్తే మోసం చేసిందంటూ మరో మహిళా వ్యాపారవేత్త రోహిణి సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శిల్ప, ఆమె భర్త కృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస ప్రసాద్‌ ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఆ ముగ్గురు మహిళలకు ఇప్పటికే 50 శాతం సొమ్ము తిరిగి ఇచ్చిసినట్లు శిల్పాచౌదరి పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top