హత్రాస్‌లో మరో దారుణం : బాధితురాలి తండ్రి హత్య

Sex Assault  Man Out On Bail, Shoots Survivor Father  - Sakshi

లైంగిక వేధింపుల కేసులో శిక్ష

బెయిల్‌పై వచ్చి బాధితురాలి తండ్రిపై కాల్పులు

సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో నేరాలు, ఘోరాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక వ్యక్తి,  బాధితురాలి తండ్రిని కాల్చి చంపిన  వైనం కలకలం సృష్టించింది. యూపీ‌లోని హత్రాస్ జిల్లాలో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

హత్రాస్ పోలీస్ చీఫ్ వినీత్ జైస్వాల్  అందించిన సమాచారం ప్రకారం  మరణించిన వ్యక్తి, నిందితుడు గౌరవ్ శర్మపై 2018 జూలైలో  వేధింపుల కేసు పెట్టాడు. ఈ కేసులో శిక్ష పడిన అతనికి ఒక నెల తరువాత స్థానిక కోర్టు బెయిల్‌మంజూరుచేయడంతో గ్రామానికి వచ్చాడు.  అప్పటినుంచి ఇరు కుటుంబాల మధ్య  అంతర్గతంగా  వైరం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గౌరవ్‌ శర్మభార్య, అత్త దేవాలయానికి వెళ్లారు. అదే సమయంలో బాధితుడి ఇద్దరు కుమార్తెలు కూడా వచ్చారు. ఈ సందర్బంగా వారి మధ్య వివాదం రగిలింది. అది కాస్తాపెద్దది కావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గౌరవ్‌ శర్మ కోపంతో రగిలిపోయాడు. తన అనుయాయులను పిలిపించుకొని మరీ మరింత గలాటా చేశాడు.  విషయం తెలుసుకున్న మహిళ తండ్రి జోక్యం చేసుకున్నాడు. దీంతో పథకం ప్రకారం రెచ్చిపోయిన గౌరవ్‌ బాధితుడిపై కాల్పులకు తెగబడ్డాడు.  తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలాడు. దీనిపై  గతంలో తనపై వేధింపులకు పాల్పడిన అతడిని జైలుకు పంపించామన్న అక్కసుతోనే తన తండ్రిని కాల్చిచంపాడని బాధితుడి కుమార్తె కన్నీరుమున్నీరైంది.  తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది. 

ఈ కేసులో గౌరవ్ శర్మ కుటుంబ సభ్యుడు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని,  జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలిచ్చారు.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top