బెంగాల్లో మిస్సింగ్‌.. హైదరాబాద్‌లో ట్రేసింగ్‌!

Rachakonda Police Trace Woman Missing Case In 10 Hours - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పశ్చిమ బెంగాల్‌లో అదృశ్యమై.. హైదరాబాద్‌ చేరిన యువతి జాడను రాచకొండ పోలీసులు 10 గంటల వ్యవధిలోనే గుర్తించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ ఆదేశాలతో మనుషుల అక్రమ రవాణా విభాగ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ నేతృత్వంలోని బృందం టెక్నికల్‌ డాటా ఆధారంగా బాధితురాలి జాడను గుర్తించి రక్షించింది. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో ఓ యువకుడు 23 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. శనివారం ఉదయం ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. వ్యభిచారం చేయాలని బలవంతం చేయడంతో బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. వారు వెంటనే ఈ విషయాన్ని అక్కడి పోలీసులకు చెప్పారు. దీంతో అక్కడ మహిళల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తివాహిని ఎన్జీవో సభ్యులు కూడా అప్రమత్తమై హైదరాబాద్‌లోని ప్రజ్వల ఎన్జీవో బృందానికి తెలిపారు.

అదే సమయంలో పశ్చిమబెంగాల్‌ పోలీసులు, ప్రజ్వల సంస్థ ప్రతినిధులు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ దృష్టికి తీసుకొచ్చారు. బాధితురాలు తల్లిదండ్రులకు చేసిన ఫోన్‌ కాల్‌ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లుగా గుర్తించి నిఘా పెట్టారు. కొన్ని గంటల వ్యవధి లోనే మరో ఫోన్‌ నంబర్‌ నుంచి తల్లిదండ్రులకు బాధితురాలు కాల్‌ చేయడంతో దాన్ని ట్రేస్‌ చేసి ఆ అమ్మాయిని రక్షించారు. ‘ఇరు రాష్ట్రాల పోలీసులు, శక్తివాహిని, ప్రజ్వల సంస్థల సభ్యులు ఈ అమ్మాయిని రక్షించేందుకు దాదాపు 5 గంటల పాటు శ్రమించారు. చివరికి శనివారంరాత్రి 11.30 గంటల ప్రాంతంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఛేదనలో సీపీ మహేశ్‌భగవత్‌ చూపిన చొరవ ప్రశంసనీయం’అని ప్రజ్వల సంస్థ నిర్వాహకు రాలు డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top