మూడోసారి ఆడపిల్లేనని.. గర్భస్రావానికి మాత్రలు మింగిన యువతి మృతి

Pregnant Woman Dies After Taking Abortion Pills in Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: మూడోసారి గర్భంలోనూ ఆడపిల్లే ఉందన్న బాధతో ఓ యువతి గర్భస్రావం చేసు కోవడానికి మాత్రలు మింగడంతో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. కడలూరు జిల్లా వేపూర్‌ సమీపంలోని కీళకురిచ్చి గ్రామానికి చెందిన గోవిందరాజ్, అముద (27) దంపతులు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అముద మూడోసారి గర్భం దాల్చింది. కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డా, ఆడబిడ్డా అని అముద తెలుసుకోవాలనుకుంది. దీనికి సంబంధించి పరీక్షలు చేయించుకునేందుకు గత 17వ తేదీ అముద కల్లకురిచ్చి జిల్లా అసకలత్తూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లింది.

అక్కడ ఉన్న ఆస్పత్రి యజమాని, అముద కడుపుని స్కాన్‌ చేసి, ఆమె ఆడపిల్లను మోస్తున్నట్లు చెప్పింది. మూడోసారి ఆడబిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టం లేని అముద అబార్షన్‌ చేయమని కోరింది. ఆ తర్వాత అముదకు అదే ఫార్మసీలో అబార్షన్‌ మాత్రలు ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత వేపూర్‌ సమీపంలోని నిరామణిలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 2 రోజులు అక్కడే ఉన్న ఆమెకు శనివారం సాయంత్రం తీవ్ర రక్తస్రావం అయింది.

కొద్దిసేపటికి స్పృహతప్పి పడిపోయింది. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు వెంటనే అముదను చికిత్స నిమిత్తం వేపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అముద అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి వేపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ప్రభుత్వ టీచర్‌గా హిజ్రా.. చదువుపై ఇష్టంతో.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top