యజమాని వేధింపులు: బాలిక ఆత్మహత్య 

Owner Harassment Girl Deceased In Shamshabad - Sakshi

సాక్షి, శంషాబాద్‌: యజమాని వేధింపులు భరించలేకే హిమాయత్‌నగర్‌లో మూడు రోజుల క్రితం బాలిక ఆత్మహత్య చేకుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. సోమవారం శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఈ నెల 24న బాత్కు మధుయాదవ్‌(44) ఇంట్లో పనిచేసే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతిచెందిన బాలికతో పాటు ఆమె సోదరి నాలుగేళ్లుగా మధుయాదవ్‌ ఇంట్లో నెలవారీ జీతానికి పనిచేస్తున్నారు.

ఈ నెల 24వ తేదీన రాత్రి పని ఉందని చెప్పి నిద్రిస్తున్న బాలికను మధుయాదవ్‌ ఇంట్లోని రెండో అంతస్తుకు తీసుకెళ్లాడు. మరుసటి రోజు ఉదయం ఆమె సోదరి నిద్రలేచి చూసేసరికి బాలిక ఉరి వేసుకుని ఉంది. కడుపు నొప్పితో ఉరి వేసుకుందని చెప్పాలని మధుయాదవ్‌ బాలిక సోదరిపై ఒత్తిడి చేశాడు. కాగా పోలీసు విచారణలో మధుయాదవ్‌ వేధింపుల కారణంగానే తన అక్క ఉరి వేసుకుందని ఆమె వెల్లడించింది. దీంతో బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం, వేధింపులకు పాల్పడిన కారణంగా మధుయాదవ్‌పై నిర్భయ చట్టం, జువైనల్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.

గతంలో కూడా మధుయాదవ్‌పై మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉందని, అతడిపై పీడీ యాక్టు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌ చక్రవర్తి ఆధ్వర్యంలో కేసును వేగంగా దర్యాప్తు చేసినట్లు వెల్లడించారు. హోంమంత్రి మహమూద్‌ అలీ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌కు ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. విచారణను వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎంపీ రంజిత్‌రెడ్డి సీపీ సజ్జనార్‌ను కోరారు. 

నిందితుడిని అరెస్టు చేయాలని ఆందోళన..
మొయినాబాద్‌ రూరల్‌ (చేవెళ్ల): బాలిక అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేయాలని ఆమె బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. బాత్కు మధుయాదవ్‌ బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి హిమాయత్‌నగర్‌ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. నిందితుడు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని, పోలీసులు కూడా అతడికే వత్తాసు పలుకుతున్నారని రోడ్డుపై బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం తెలసుకున్న శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న వారితో మాట్లాడారు. కేసు విచారణ బాధ్యతను తానే తీసుకుంటున్నట్లు డీసీపీ హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.  

మహిళ ప్రాణాలు బలిగొన్న వివాహేతర సంబంధం 
ఆమనగల్లు: వివాహేతర సంబంధం మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. తలకొండపల్లి ఎస్‌ఐ బీఎస్‌ఎస్‌ వరప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన చెన్నమ్మ(38), రాములు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లికి చెందిన జంగయ్యతో చెన్నమ్మ వివాహేతర సంబంధం పెట్టుకుని షాద్‌నగర్‌లో జ్యూస్‌ బండి నిర్వహిస్తుంది. తన సోదరి కనిపించడం లేదని ఈనెల 22న షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో చెన్నమ్మ తమ్ముడు కురుమయ్య ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి షాద్‌నగర్‌ సీఐ శ్రీధర్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ మేరకు జంగయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 20న చెన్నమ్మ, జంగయ్య తలకొండపల్లి మండలంలోని చెన్నారం సమీపంలో గల మల్లప్పగుట్టపైకి వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఇద్దరూ గొడవపడ్డారని, తాగిన మత్తులో ఉన్న జంగయ్య రాయితో చెన్నమ్మను కొట్టడంతో అక్కడే మృతిచెందిందని తెలిపారు. సోమవారం మల్లప్పగుట్ట సమీపంలో చెన్నమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

భార్య కాపురానికి రావడం లేదని.. 
ఇబ్రహీంపట్నంరూరల్‌: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి గురైన భర్త చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆదిబట్ల సీఐ నరేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలంలోని చాందన్‌ఖాన్‌గూడ గ్రామానికి చెందిన పండ్ల రమేష్‌(30) భార్య ప్రేమలతతో కలిసి తుర్కయంజాల్‌లో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా, ఇటీవల ప్రేమలత పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్‌ ఆదివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకునేందుకు తుర్కయంజాల్‌ మసాబ్‌ చెరువులో దూకాడు. రోడ్డున పోయే వారు గమనించి ఆదిబట్ల పోలీసులకు సమాచారం అందజేయగా పెట్రోలింగ్‌ వాహనంలో ఉన్న కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగార్డు యాదగిరి చెరువులో దూకి రమేష్‌ను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చారు.

రమేష్‌ను కాపాడిన పోలీసులు, సీపీ చేతుల మీదుగా నగదు పురస్కారం అందుకుంటున్న కానిస్టేబుల్‌ సత్యనారాయణ   
డీజీపీ, రాచకొండ సీపీ ప్రశంస.. 
చెరువులో దూకిన వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్‌ సత్యనారాయణ, హోంగార్డు యాదగిరిని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌లో అభినందించారు. అదేవిధంగా రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ సీఐ నరేందర్‌ ఆధ్వర్యంలో కానిస్టేబుల్, హోంగార్డులను సోమవారం నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని నగదు పురస్కారం అందజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top