సాక్షి, మల్కన్‌గిరి: మద్యం మత్తులో ఏకంగా తన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. సోమవారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన జిల్లాలోని మల్కన్‌గిరి సమితి, పలకొండ గ్రామానికి చెందిన ఇంగ మడకామి.. తన తండ్రి బీమా మడకామితో ఆస్తి విషయమై గొడవపడ్డాడు. ఇది క్రమక్రమంగా పెరిగి ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వచ్చింది. ఈ క్రమంలో ఒకానొక దశలో కోపోద్రేకుడైన ఇంగ మడకామి తన తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టాడు.
దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బీమా మడకామి కాసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, జైలుకి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహం తరలించినట్లు పోలీసులు తెలిపారు.


