పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని.. | Love Couple Committed Suicide In Suryapet | Sakshi
Sakshi News home page

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని..

Dec 12 2020 5:36 AM | Updated on Dec 12 2020 9:09 AM

Love Couple Committed Suicide In Suryapet - Sakshi

మునగాల/చివ్వెంల: కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని ఓ ప్రేమజంట అర్ధంతరంగా ఆయుష్షు తీసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్లకు చెందిన ఆ ప్రేమికులు మునగాల మండలంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చందుపట్ల గ్రామానికి చెందిన ఓర్సు అంజయ్య కుమారుడు నవీన్‌ (21) ఇంటర్మీడియెట్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో కూలి పనిచేస్తూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన పదో తరగతి చదువుతున్న బాలిక (16)తో నవీన్‌కు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఆరు నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. పది రోజుల క్రితం వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించారు. నాటి నుంచి ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. 

రాత్రి బైక్‌పై బయలుదేరి..: ఇక ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని భావించిన ఆ ప్రేమికులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై గ్రామం నుంచి బయలుదేరారు. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి మీదుగా మునగాల మండలం మొద్దులచెరువు స్టేజీ నుంచి రేపాల గ్రామానికి వెళ్లే రహదారికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ వేపచెట్టు వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

శుక్రవారం తెల్లవారు జామున రహదారిపై వెళ్తున్న కొందరు స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మునగాల ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బైక్‌ నంబర్‌ ఆధారంగా ముందు మృతుడు నవీన్‌ అడ్రస్‌ను గుర్తించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో మృతదేహాలను కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక వీఆర్‌ఓ వీరారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement