టు లెట్‌.. టేక్‌ కేర్‌

Lakhs Of Rupees In The Name Of Rent Cybercriminals At Work - Sakshi

హిమాయత్‌నగర్‌: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్‌ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్‌ నంబర్‌ నుంచి ఇంటి యజమానికి ఫోన్‌ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్‌సైట్‌లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు.  

ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్‌ నేరగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్‌కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్‌ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్‌ మెట్లు ఎక్కుతున్నారు.  

నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు 
ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్‌ ముందుగానే మీ అకౌంట్‌లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు.

అవి పంపినప్పటి నుంచి సైబర్‌ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్‌ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు.   

(చదవండి:  దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top