
కోల్‌కతా: ప్రస్తుత రోజుల్లో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అర్థం కావడం లేదు. చుట్టూ ఉన్న జనం మంచిగా ఉంటున్నారని వారు మనకి అండగా ఉంటారనుకోవడానికి లేదు. వెనకాల గోతులు తీసేవాళ్లు, అవకాశం వస్తే తమ అవసరాలు తీర్చుకునే వాళ్లు ఉంటారనేది గ్రహించాలి. తాజాగా జరిగిన ఘటన అందుకు అద్దం పడుతుంది.
తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మి వెళ్లిన ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె బర్త్ డే రోజున.. పుట్టిన రోజు తాము చేస్తామని నమ్మబలికిన ఇద్దరు ప్రబుద్ధులు.. సదరు మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో చోటు చేసుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 5వ తేదీ) జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా నగర పొలిమేర ప్రాంతమైన రీజెంట్ పార్క్ ఏరియాలో ఉంటున్న చందన్ మాలిక్, దీప్ అనే ఇద్దరు వ్యక్తులు తమకు తెలిసిన ఒక మహిళను బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తామని నమ్మబలికారు. ఆమె వారిని నమ్మడంతో దీప్ ఇంటికి తీసుకెళ్లారు. వారు ముగ్గురు కలిసి భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళతానని ఆమె చెప్పడంతో గది తలుపులు మూసివేశారు నమ్మక ద్రోహలు ఆపై ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందులో దీప్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిగా తెలుస్తోంది.
దీనిపై ఆమె ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసుల ఫిర్యాదు మేరకు ఆ నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కొన్ని నెలల క్రితం తనకు చందన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడని, అతని తనను కోల్‌కతా దుర్గా పూజా కమిటీలో హెడ్‌గా చెప్పుకొచ్చాడు. ఆ క్రమంలోనే దీప్‌ను చందన్ పరిచయం చేశాడని ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తనను పూజా కమిటీలో జాయిన్ చేస్తానని వారు ప్రామిస్ చేశారని, అలా తమ మధ్య పరిచయం ఏర్పడిందని 20 ఏళ్ల బాధిత మహిళ పేర్కొంది. తన బర్త్ డే సందర్బంగా తనను ఆ వేడుకలు చేస్తామని పిలిచి ఇలా అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో స్పష్టం చేసింది.
జూన్ 25వ తేదీన కోల్‌కతాలో లా స్టూడెంట్ అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. మనోజిత్ మిశ్రా అనే వ్యక్తి లా విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాజా సంఘటనతో కోల్‌కతా నగరంలో మహిళల భద్రతపై ఆందోళన నెలకొంది.