కూతురి ప్రేమ: యువకుడి కాళ్లు, చేతులు నరికి హత్య

Girl Father Assassinate Her Lover In guntur district - Sakshi

సాక్షి, పెదకాకాని (పొన్నూరు): ప్రేమించినందుకు ఓ యువకుడి కాళ్లు, చేతులు నరికేశారు యువతి బంధువులు. రెండు గంటల పాటు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడిన ఆ యువకుడు.. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం మేరకు.. పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామానికి చెందిన విన్నకోట వెంకటేష్‌ అలియాస్‌ బండ్రెడ్డి (23) మంగళగిరికి చెందిన ఓ డాక్టర్‌ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ చదువుతున్న బాలిక వెంటపడుతున్నాడు.

కొందరు పెద్దల ద్వారా ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు చెప్పి, వివాహం చేసుకుంటానని రాయబారం కూడా పంపించాడు. కోపోద్రిక్తులైన బాలిక కుటుంబసభ్యులు ఆ యువకుడిని తీవ్రంగా మందలించారు. దీనిపై జరిగిన స్వల్ప పంచాయితీలో యువకుడి తరఫు బంధువులు కొద్ది రోజులుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలని వెంకటేష్‌ను హెచ్చరిస్తున్నారు. నెల రోజులుగా మంగళగిరిలో ఉంటున్న వెంకటేష్‌ అప్పుడప్పుడూ కొప్పురావూరు పరిసర ప్రాంతాల్లో కనిపించి కవ్వించడం బాలిక తల్లిదండ్రులను ఆవేదనకు, ఆగ్రహావేశాలకు గురి చేసింది. 

ప్లాన్‌ చేసి నరికారు.. 
ఎన్నిసార్లు చెప్పినా కుమార్తెను గ్రామంలో అల్లరి చేయడం వల్ల పరువు పోతోందని భావించిన తండ్రి కొట్టే భాస్కరరావు, కుమారుడు తేజ మరికొందరితో కలిసి వెంకటేష్‌ కాళ్లూ చేతులు నరకాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30కు మాట్లాడాలంటూ భరత్‌ ద్వారా వెంకటేష్‌ను గ్రామ శివార్లలోని నిర్మానుష్య ప్రాంతానికి  రప్పించారు. వెంకటేష్‌ కళ్లలో కారం కొట్టి వెంట తెచ్చుకున్న కత్తులతో కాళ్లూ చేతులు నరికేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాదాపు రెండు గంటల పాటు రక్తస్రావంలో పడి ఉన్న వెంకటేష్‌ను రాత్రి పది గంటలకు గుంటూరు ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి వెంకటేష్‌ మరణించాడు. మృతుడి తల్లి విన్నకోట కుమారి ఫిర్యాదు మేరకు సీఐ శోభన్‌బాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇలా ఉండగా, బాలిక సోదరుడు వైష్ణవ్‌ తేజను హతమార్చడానికి వెంకటేష్‌ ప్లాన్‌ చేశాడని, అందుకు కోపోద్రిక్తులై వెంకటేష్‌పై బాలిక కుటుంబసభ్యులు దాడికి పాల్పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది.  
చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top