వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య

Four Committed Suicide for Different Reasons in Khammam - Sakshi

స్నేహితురాలికి పెళ్లి కుదిరిందని బాలిక.. 
తిరుమలాయపాలెం : చిన్నప్పటి నుంచి ఇద్దరు విద్యార్థినులు కలిసి చదువుకున్నారు.. ప్రస్తుతం ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతుండగా... ఒకరి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించి సంబంధం ఖాయం చేశారు. ఈ విషయం తెలిసిన ఆమె స్నేహితురాలు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు... తిరుమలాయపాలెం మండలం ముజాహిదిపురం పరిధి సుద్దవాగు తండాకు చెందిన బానోతు పాచ్చానాయక్‌ కుమార్తె జ్యోతి(17) పదో తరగతి చదువుతోంది. ఆమె స్నేహితురాలికి వివాహం చేయాలని నిర్ణయించి సంబంధం కుదిర్చారు. దీంతో స్నేహితురాలు దూరమవుతోందని మనస్తాపానికి గురైన జ్యోతి ఈనెల 5న గడ్డిమందు తాగింది. ఆమెకు ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉద్యోగం పోయిందనే ఆవేదనతో..
ఖమ్మం క్రైం : ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో మద్యానికి బానిసైన ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురానికి చెందిన గండు నాగరాజు(34) భద్రాచలం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, ఆయన తరచూ విధులకు గైర్హాజరవుతుండడంతో ఏడాది క్రితం విధుల నుంచి తొలగించారు. దీంతో మద్యానికి బానిసైన ఆయన ఆదివారం తెల్లవారుజామున ఖమ్మంలో పురుగుల మందు తాగి పడిపోగా స్థానికులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య స్వాతి, ఓ కుమారుడు ఉండగా కేసు నమోదు చేసినట్లు ఖమ్మం వన్‌ టౌన్‌ ఎస్సై కొండల్‌రావు తెలిపారు.

కుటుంబ కలహాలతో..
సత్తుపల్లిరూరల్‌: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన వేల్పుల సుదర్శన్‌(45) మూడు మేకలు విక్రయించి మద్యం తాగుతుండగా భార్య ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన సుదర్శన్‌ సోమవారం ఉదయం పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. కుటుంబ సభ్యులు సత్తుపల్లి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

భార్యను వేధించి.. మందు తాగించి... ఆత్మహత్యకు కారణమైన భర్త
ఖమ్మం క్రైం : అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను తరచూ అనుమానిస్తుండడమే కాక వేధించి ఆమె ఆత్మహత్యకు భర్తే కారణమయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం త్రీటౌన్‌ గాంధీనగర్‌లో పోతురాజు మధు, భార్య శైలజ(34)తో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. పెయింటర్‌గా పనిచేసే మధు మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తూ గొడవ పడేవాడు. ఈనెల 4వ తేదీన కూడా శైలజతో గొడవపడిన ఆయన బయటకు వెళ్లి ఎలుకల మందు తీసుకొచ్చి ఆమెను రెచ్చగొడుతూ తాగేలా చేశాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్న శైలజను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది.  కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్‌ సీఐ సర్వయ్య తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top