ఆ యాప్‌ను ‘ఫాలో’ అయ్యారో ఫూల్స్‌ అయినట్టే.. ఎందుకంటే?

Cybercriminals Cheated Students Through Social Media - Sakshi

సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టులకు లైక్‌ కొడితే డబ్బు సంపాదన అంటూ ఘరానా మోసం

విద్యావంతులకు సైబర్‌ నేరగాళ్ల వల

ఇటీవల వెలుగు చూసిన ‘నెట్‌ఫ్లిక్స్‌ ఫాలో’ యాప్‌ దందా

రూ.3 వేల నుంచి రూ.లక్షల్లో డబ్బు కట్టి మోసపోయిన వేలాది మంది

వీరిలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులే అధికం

పోలీసులు కూడా బాధితులే!

సాక్షి, అమరావతి: ‘లింక్‌ క్లిక్‌ చేసి యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను ఫాలో కండి. వాటిలో పోస్టులను లైక్‌ కొట్టి స్క్రీన్‌షాట్‌ తీసి అప్‌లోడ్‌ చేయండి. రోజుకు రూ.300 నుంచి రూ.30 వేల వరకు సంపాదించండి. ఇందుకోసం కొంత మొత్తాన్ని మీరు డిపాజిట్‌ చేయాలి. డిపాజిట్‌ చేసిన మొత్తాన్ని 20 రోజుల్లో తిరిగి పొందొచ్చు. ఆ తర్వాత రోజువారీ వచ్చే డబ్బంతా లాభమే’ అంటూ సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ అందినకాడికి దండుకున్నారు. (చదవండి: దీపావళికి ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..)

ఇటీవల ‘నెట్‌ఫ్లిక్స్‌ ఫాలో’ అనే యాప్‌లో సభ్యులుగా చేరి రెండు తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది నిండా మునిగారు. అక్టోబర్‌ 22 నుంచి యాప్‌ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డబ్బు కట్టినవారు లబోదిబోమంటున్నారు. బాధితుల్లో అత్యధికులు, మెడిసిన్, డిగ్రీ విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులే. కొందరు పోలీసులు సైతం మోసపోయినవారిలో ఉండటం గమనార్హం. (చదవండి: AP: ఆర్టీసీలో ఇ–బస్సులకు లైన్‌క్లియర్‌)

ఏంటీ ఫాలో యాప్‌..
యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆయా ఖాతాలను ఫాలో అవుతూ.. అందులో పోస్టులకు లైక్‌లు కొడితే వేతనాలు పొందొచ్చు అంటూ ఫాలో యాప్‌ను కొద్ది నెలల క్రితం సైబర్‌ నేరగాళ్లు తీసుకువచ్చారు. ఇందులో రెగ్యులర్‌ స్టాఫ్, మేనేజర్, డైరెక్టర్, జనరల్‌ మేనేజర్, బాస్, సీఈవో, సీఎంవో ఇలా వివిధ హోదాలను పేర్కొన్నారు. ఈ హోదాల్లో యాప్‌లో చేరడానికి రెగ్యులర్‌ స్టాఫ్‌ రూ.3 వేలు, మేనేజర్‌ రూ.6 వేలు, డైరెక్టర్‌ రూ.15 వేలు, జనరల్‌ మేనేజర్‌ రూ.45 వేలు, బాస్‌ రూ.90 వేలు, సీఈవో రూ.2.70 లక్షలు, సీఎంవో రూ.6 లక్షలు చెల్లించాలని నిబంధన పెట్టారు.

రోజువారీ టాస్క్‌లు
ఫాలో యాప్‌లో సభ్యులకు సామాజిక మాధ్యమాల ఖాతాలను సబ్‌స్క్రైబ్‌ చేసి, అందులో పోస్టులకు లైక్‌ కొట్టే రోజువారీ టాస్క్‌ ఇస్తారు. హోదాను బట్టి రోజుకు 6 నుంచి 30 టాస్కులు చేయాల్సి ఉంటుంది. టాస్కులు చేసిన వెంటనే యాప్‌లో డబ్బు జమవుతాయి. టాస్కులతోపాటు తమ కింద కొత్తగా సభ్యుడిని చేర్పించినవారికి కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తూ వచ్చారు. మొదటి మూడుసార్లు రూ. వెయ్యి దాటిన వెంటనే డబ్బు బ్యాంక్‌ ఖాతాలోకి జమ చేసుకునేలా వీలు కల్పించారు. నాలుగోసారి నుంచి రూ.5 వేలు దాటితే నగదు బదిలీకి అవకాశమిచ్చారు. దీంతో సభ్యులుగా ఉన్నవారు ఇబ్బడిముబ్బడిగా బంధువులు, స్నేహితులను యాప్‌లో చేర్పించారు. ఫాలో యాప్‌లో సభ్యులుగా ఉన్నవారితో టెలిగ్రామ్, వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటయ్యాయి. టెలిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన గ్రూప్‌లో ఏకంగా 40 వేల మందికి పైగా ఉన్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్టు సమాచారం.

రోజుకో ట్విస్ట్‌
ఈ నెల 14 వరకు టాస్కులు పూర్తి చేసి, నగదు బదిలీకి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బు జమవుతూ వచ్చాయి. ఆ తర్వాతి రోజు నుంచి నగదు బదిలీలు నిలిచిపోయాయి. బ్యాంకులకు వరుస సెలవులు ఉండటం వల్ల నగదు బదిలీలు నిలిచిపోయాయని యాప్‌ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అనంతరం రోజుకో ట్విస్ట్‌తో ఈ నెల 22న యాప్‌ను నిలిపివేస్తున్నట్టు యాప్‌ ప్రతినిధులు ప్రకటించారు. గురువారం టెలిగ్రామ్‌లోని గ్రూప్‌ను కూడా తొలగించారు. 

స్వల్ప మార్పులతో కొత్త యాప్‌
ఫాలో యాప్‌ పేరుతో వేల మందిని బురిడీ కొట్టించి రూ. కోట్లలో కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్ల ముఠా ఇంకో కొత్త మోసానికి తెరతీసింది. ఫాలో యాప్‌కే స్వల్ప మార్పులు చేసి పేరు మార్చి కొత్తగా ప్యూర్‌ హార్ట్, టూబెస్ట్‌ అనే యాప్‌లను తాజాగా వాడుకలోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌లు గూగుల్‌ ప్లేస్టోర్, యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉండవు. వాట్సాప్, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో అడ్మిన్‌లు పంపే లింక్‌ల ద్వారానే ఈ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

రూ.2 లక్షలు నష్టపోయా..
ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా. నా సహ ఉద్యోగి సలహా మేరకు రూ.90 వేలు కట్టి బాస్‌గా చేరాను. నేను చెల్లించిన డబ్బు 20 రోజుల్లో వచ్చేసింది. అప్పు చేసి మరీ రూ.2.70 లక్షలు చెల్లించి సీఈవోగా రెండో అకౌంట్‌ తీసుకున్నాను. అకౌంట్‌ తీసుకున్న వారానికే యాప్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రూ.2 లక్షలు నష్టపోయాను. నా స్నేహితులు కూడా రూ.లక్షల్లో నష్టపోయారు. 
– రవితేజ, బాధితుడు అనంతపురం జిల్లా

ప్రజలు అప్రమత్తతతో ఉండాలి
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం,  మనుషుల ఆలోచన సరళికి అనువుగా సైబర్‌ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ తరహా గొలుసుకట్టు మోసాలు అనేకం వెలుగు చూశాయి. బాధితులు పోలీసులను సంప్రదిస్తే న్యాయం చేస్తాం. ప్రజలు అప్రమత్తతతో వ్యవహరిస్తే సైబర్‌ నేరాల కట్టడి సాధ్యం.  
– రాధిక, ఏపీ సీఐడీ సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ

అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి చేరాను
నేను ప్రైవేట్‌ విద్యా సంస్థలో చిరుద్యోగిని. మా అమ్మ బంగారు గొలుసు తాకట్టు పెట్టి రూ.90 వేలు కట్టి సభ్యుడిగా చేరా.  చేరిన నాలుగు రోజులకే యాప్‌ నిలిచిపోయింది. రూ.80 వేలు నష్టపోయాను.
– హర్ష, బాధితుడు, కృష్ణా జిల్లా 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top