యాదాద్రి కలెక్టరేట్‌లో దంపతుల ఘర్షణ 

Couple Clash in Yadadri Collectorate - Sakshi

భర్తపై కత్తితో దాడి చేసిన భార్య 

భర్తకు తీవ్రగాయాలు...ఆస్పత్రికి తరలింపు

భువనగిరి క్రైం: కొద్దికాలంగా తనతో సఖ్యతగా ఉండటంలేదన్న కోపంతో భర్తపై కత్తితో దాడి చేసింది ఓ భార్య. శుక్రవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్‌లో ఆత్మకూర్‌(ఎం) మండల వ్యవసాయశాఖ అధికారిణిగా పనిచేస్తున్న నర్ర శిల్ప, అదే కార్యాలయంలో తన కిందిస్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్న మాటూరి మనోజ్‌గౌడ్‌ను గతేడాది జూన్‌ 7న ప్రేమ వివాహం చేసుకున్నారు.

కాగా 3నెలల క్రితం మనోజ్‌గౌడ్‌ యాదగిరిగుట్టకు డిప్యూటేషన్‌పై వెళ్లి అనంతరం సెలవుపై వెళ్లాడు. శుక్రవారంతో సెలవులు పూర్తికావడంతో విధులకు హాజరుకావడానికి రిపోర్ట్‌ చేసేందుకు కలెక్టర్‌ట్‌కు వచ్చాడు. అదేసమయంలో భర్తతో మాట్లాడేందుకు శిల్ప దగ్గరకు వెళ్లింది. గొడవల నేపథ్యంలో వారిద్దరిమధ్య మాటామాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో శిల్ప కత్తి తీసుకుని మనోజ్‌పై దాడి చేయగా..అతడి వీపు, మెడపై తీవ్రగాయాలయ్యాయి. సహోద్యోగులు వెంటనే వారిని అడ్డుకుని మనోజ్‌ను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి, అక్కడ్నుంచి హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై శిల్పను వివరణ కోరగా..మనోజ్‌ కొంతకాలంగా తనతో సఖ్యతగా ఉండటం లేదని ఇదే విషయం మాట్లాడేందుకు రాగా తనపై కత్తితో దాడి దిగాడని చెప్పారు. దీంతో ఆత్మరక్షణార్థం అతడి వద్ద ఉన్న కత్తిని లాక్కుని దాడి చేసినట్లు చెప్పారు. శిల్ప, మనోజ్‌ తండ్రి ఉపేందర్‌ వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఘటనపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని భువనగిరి కలెక్టర్‌ హనుమంతు కె.జడంగే చెప్పారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top