కరోనాను జయించి.. కేన్సర్‌కు భయపడి 

Corona Cured Patients Deceased For Cancer Fear In Kurnool District - Sakshi

అన్యోన్య దంపతులు వారు. ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చినా హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ మహమ్మారిని జయించారు. అయితే కేన్సర్‌కు మాత్రం భయపడ్డారు. వ్యాధితో పోరాడకుండానే తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన మండల పరిధిలోని కొండజూటూరులో శుక్రవారం చోటుచేసుకుంది.  

సాక్షి, పాణ్యం: గ్రామానికి చెందిన గజ్జె వెంకటరమణ(62)కు మొదటి భార్య అనారోగ్యంతో మృతిచెందడంతో తొమ్మిదేళ్ల క్రితం ప్రకాశం జిల్లా నాయుడుపేటకు చెందిన కాశమ్మ(55)ను రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమారులతో కలిసి ఉన్నా.. ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించేవారు. కాగా కాశమ్మ కేన్సర్‌ బారిన పడింది. నెల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు త్వరలోనే ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. అందులోభాగంగా కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకొని మహమ్మారిని జయించారు.

ఆపరేషన్‌ విషయమై భర్తతో చెబుతూ భయపడేది. తాను బతకనేమోనని ఆందోళన చెందేది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులంతా వ్యవసాయ పనులకు వెళ్లిన తర్వాత తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఒకరిని విడిచి ఒకరు ఉండలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని నోట్‌బుక్‌లో రాసి, ఇద్దరూ సంతకం చేసి ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణం చెందారు. దంపతుల ఆత్మహత్యతో గ్రామంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న జెట్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి గ్రామానికి చేరుకుని సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top