‘స్కిల్‌’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ కుంభకోణం కుట్రదారు చంద్రబాబే

Published Thu, Sep 14 2023 3:58 AM

CID Additional DG Sanjay revealed Skill Development Scam facts - Sakshi

సాక్షి, అమరావతి: ‘టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం ప్రధాన కుట్రదారుడు చంద్రబాబు నాయుడే. సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా మోసపూరితంగా వ్యవహరించారు. కేబినెట్‌ ఆమోదం లేకుండా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు నుంచి నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల వరకు ఆయనే సర్వం తానై వ్యవహరించారు.  

ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లలో ఏ–1 చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారు. ఏ–2 అప్పటి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంతకాలు అయిదు చోట్ల ఉన్నాయి’ అని సీఐడీ అదనపు డీజీ సంజయ్‌ వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో సీఐడీ ఎస్పీ ఫక్కీరప్పతో కలసి బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ గురించిగానీ ఒప్పందం గురించిగానీ తమకు తెలియదని సీమెన్స్‌ కంపెనీయే ఈ మెయిల్‌ ద్వారా న్యాయస్థానంలో 164 సీఆర్‌పీసీ వాంగ్మూలం ద్వారా స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కుంభకోణం ద్వారా అక్రమంగా మళ్లించిన రూ.371 కోట్లలో షెల్‌ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబుకే చేరాయన్నారు. సీఐడీతోపాటు సమాంతరంగా దర్యాప్తు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌ పేరిట షెల్‌ కంపెనీల ద్వారా నిధులు కొల్లగొట్టారని నిర్ధారించిందని చెప్పారు.

విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం ఈ కేసును పది గంటలపాటు సుదీ­ర్ఘంగా విచారించి.. చంద్రబాబు అవినీతికి పాల్ప­డ్డారని పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ఆయనకు రిమాండ్‌ విధించిందన్నారు. సీఐడి అదనపు డీజీ సంజయ్‌ ఇంకా ఏం చెప్పారంటే..

కుంభకోణం సూత్రధారి చంద్రబాబే 
కేబినెట్‌ ఆమోదం లేకుండానే రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)­ను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్‌ పేరిట ప్రజాధనం కేటాయింపు అంతా గంటా సుబ్బారావు అనే ప్రైవేటు వ్యక్తి చేతిలో పెట్టారు. అందుకోసం ఆయనకు ఏకంగా నాలుగు పోస్టులు కట్టబెట్టారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ–ఈసీవోగా మొదట నియమించి, అనంతరం ఉన్నత విద్యా శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌–ఇన్నోవేషన్‌ శాఖ కార్యదర్శి పోస్టుతోపాటు ఏకంగా సీఎం ఎక్స్‌ అఫీషియో కార్యదర్శిగా కూడా నియమించారు.

♦ డిప్యూటీ సీఈవోగా అపర్ణను నియమించారు. ఆమె భర్త సీమెన్స్‌ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇది పరస్పర ప్రయోజనాల కిందకు వస్తుంది. ఇక టీడీపీకే చెందిన జె.వెంకటేశ్వర్లు అనే చార్టెడ్‌ అకౌంటెంట్‌కు ఏపీఎస్‌ఎస్‌డీసీలో పోస్టు కట్టబెట్టారు. ఉన్నత విద్యా శాఖను బైపాస్‌ చేశారు. ఎలాంటి ప్రాతిపదిక లేకుండా బడ్జెట్‌ను ఆమోదించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపట్టాలన్న ప్రతిపాదనను బేఖాతరు చేస్తూ ఏకపక్షంగా ఆరు చోట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. 
సీమెన్స్‌ కంపెనీ పేరుతో మోసం

♦ టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్, అందుకోసం ఒప్పందం గురించి సీమెన్స్‌ కంపెనీకి తెలియనే తెలీదు. చంద్రబాబు కేవలం నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరును వా­డుకుని మోసానికి పాల్పడ్డారు. జర్మనీలోని సీ­మె­న్స్‌ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అ­సలు ఆ జీవో గురించి, ఆ ఒప్పందం గురించి త­మకు ఏమాత్రం తెలియదని వెల్లడించింది. 

♦ ఏపీఎస్‌ఎస్‌డీసీ చెబుతున్న రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌తో తమకు సంబంధం లేదని, ఆ ఒప్పందం గురించి తమకు ఏమాత్రం తెలియదని స్పష్టం చేసింది. తాము 90 శాతం నిధులను గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా ఇస్తామని ఎవరికీ చెప్పలేదని.. అసలు ఆ వ్యవహారంతో సీమెన్స్‌ కంపెనీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు సీమెన్స్‌ కంపెనీ ఈ మెయిల్‌ ద్వారా వివరించడంతోపాటు న్యాయస్థానంలో 164­సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది.

♦ సీమెన్స్‌ కంపెనీ అంతర్గతంగా కూడా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను ఏపీఎస్‌ఎస్‌డీసీ, సీఐడీలకు అందించింది. భారత్‌లో సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధిగా ఉన్న సుమన్‌ బోస్‌ మరికొందరు నిందితులతో కలసి జర్మనీలోని ప్రధాన కార్యాలయానికి తెలియకుండా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని నిర్ధారించింది. ఈ మే­రM­ý ు సుమన్‌బోస్, ఇతరులు డిలీట్‌ చేసిన ఈ మెయిల్స్, వాట్సాప్‌ మెసేజ్‌లు, మెసేజ్‌లు, ఇత­ర డాటాను రిట్రైవ్‌ చేసి సీఐడీకి అందించింది.

♦ డిజైన్‌ టెక్‌ కొరితే తాము రూ.58.80 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే ఆ కంపెనీకి విక్రయించామని తెలిపింది. ఎవరైనా తమ వద్ద నుంచి సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసుకోవచ్చని, అంత మాత్రాన తాము ఆ ఒప్పందంలో భాగస్వాములమైనట్టు కాదని వెల్లడించింది. 

రూ.3,300 కోట్లు ప్రాజెక్ట్‌గా నకిలీ ఒప్పందం
♦ సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం ఇచ్చిన వాంగ్మూలంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.58 కోట్ల ప్రాజెక్ట్‌ను రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌గా చూపిస్తూ చంద్రబాబు భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు పన్నాగం పన్నారు. అందుకోసమే జీవోకు విరుద్ధంగా నకిలీ ఒప్పందాన్ని తీసుకువచ్చారు. డిజైన్‌ టెక్‌ అనే కంపెనీని భాగస్వామిని చేశారు.

 సీమెన్స్‌ కంపెనీ నుంచి 90 శాతం నిధులు రావని తెలుసు. ఎందుకంటే వారికి అసలు ఒప్పందం గురించే తెలియదు. అందుకే ప్రభుత్వ వాటా 10 శాతం నిధులను నిబంధనలకు విరుద్ధంగా డిజైన్‌టెక్‌ కంపెనీకి చెల్లించి.. పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి మళ్లించి.. అక్కడి నుంచి వివిధ షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు దక్కించుకున్నారు. 

చంద్రబాబు ఒత్తిడితోనే రూ.371 కోట్లు విడుదల
♦ జీవోలో పేర్కొన్నట్టు రూ.3,300 కోట్ల ప్రాజెక్ట్‌లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా 90 శాతం వాటాలో ఒక్క రూపాయి కూడా రాలేదు. కానీ ప్రభుత్వ వాటా 10 శాతం జీఎస్టీతో కలిపి రూ.371 కోట్లను డిజైన్‌ టెక్‌ కంపెనీకి ఏకపక్షంగా విడుదల చేశారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని నోట్‌ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొన్నారు.

♦ కానీ నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేయాలని అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఆదేశించారు. అదే విషయాన్ని అధికారులు నోట్‌ ఫైళ్లలో స్పష్టంగా పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే నిధులు విడుదల చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరమే నిధులు విడుదల చేశారు. 

షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు రూ.241 కోట్లు
♦ డిజైన్‌ టెక్‌ కంపెనీకి విడుదల చేసిన రూ.371 కోట్లలో ఆ కంపెనీ సీమెన్స్‌ కంపెనీ నుంచి రూ.­58.80 కోట్ల సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి అందించింది. మిగిలిన రూ.311 కోట్లను డిజైన్‌ టెక్‌ కంపెనీ వివిధ షెల్‌ కంపెనీలకు మళ్లించింది. 

♦ వాటిలో షెల్‌ కంపెనీలకు కమీషన్లు పోగా, మిగిలిన రూ.241 కోట్లు చంద్రబాబుకు చేర్చారు. అంటే ఈ కుంభకోణం ద్వారా చంద్రబాబు రూ.241 కోట్లు అక్రమంగా కొల్లగొట్టారన్నది ఆధారాలతోసహా నిర్ధారణ అయ్యింది. 

గుజరాత్‌ మోడల్‌ కాదు..
♦ యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం గుజరాత్‌లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్‌నే ఏపీలో అమలు చేశామని టీడీపీ చెబుతుండటం సరికాదు. అధి­కారుల బృందం గుజరాత్‌లో పర్యటించి అక్కడి ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. కానీ అందుకు విరు­ద్ధంగా ఏపీలో ప్రాజెక్ట్‌ను రూపొందించింది. 

♦ 90 శాతం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ అన్నది జీవోలో చూపించారు గానీ ఒప్పందంలో లేదు. ఇక పైలట్‌ ప్రాజెక్ట్‌గా అమలు చేసి ఫలితాలను చూసి నిర్ణయం తీసుకుందామన్న అధికారుల ప్రతిపాదనను పట్టించుకోలేదు. కేవలం రూ.371 కోట్లు కొల్లగొట్టడానికే ఈ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చారు. 
నోట్‌ ఫైళ్లు మాయం

♦ ఈ కుంభకోణం బయట పడకూడదనే ఉద్దేశంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్‌ ఫైళ్లను ఉద్దేశ పూర్వకంగా గల్లంతు చేశారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు జీవోకు సంబంధించిన నోట్‌ ఫైళ్లు, నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాల నోట్‌ ఫైళ్లను మాయం చేశారు. కానీ సీఐడీ వాటిని రిట్రైవ్‌ చేసింది.

♦ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఏర్పాటు గురించి జీవో 4, సీమెన్స్‌తో ఒప్పందం గురించి జీవో 5 జారీ చేశారు. కానీ ఆ రెండు జీవోలకు సంబంధించిన నోట్‌ ఫైళ్లను మాయం చేశారు. కానీ జీవో 8 ద్వారా అంతకు ముందు ఇచ్చిన జీవోలు 4, 5 లోని అంశాలను సీఐడీ గుర్తించి వెలికి తీయడంతో ఈ కుంభకోణం వెనుక ఉన్న కుట్ర బయటపడింది.

చంద్రబాబు ముఠా ద్వారా అక్రమ నిధుల తరలింపు
♦ షెల్‌ కంపెనీల ద్వారా దారి మళ్లించిన నిధులు చంద్రబాబు తన ముఠా మనుషుల ద్వారా పొందారు. చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసాని, షెల్‌ కంపెనీల సృష్టికర్త యోగేశ్‌ గుప్తా ఇందులో కీలక పాత్ర పోషించారు. 

♦ డిజైన్‌టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లు వివిధ షెల్‌ కంపెనీల ద్వారా యోగేశ్‌ గుప్తాకు చేరాయి. ఆయన ఆ రూ.241 కోట్లు డ్రా చేసి నగదును మనోజ్‌ పార్థసానికి ముంబయిలో అందించారు. మనోజ్‌ పార్థసాని ఆ రూ.241 కోట్ల నగదును హైదరాబాద్‌ తీసుకువచ్చి చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివా­స్‌కు అందించారు. ఆయన ఆ నగదును చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.

♦ నిధుల తరలింపులో పాత్రధారులుగా వ్యవహరించిన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తాలే చంద్రబాబు ఇతర కుంభకోణాల్లోనూ నిధుల తరలింపులో కీలకంగా వ్యవహ­రించారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల నిర్మాణం, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులు కట్టబెట్టిన కుంభకోణంలో నిధులను షెల్‌ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. 

♦ ఆ విషయం ఆదాయ పన్ను శాఖ దర్యాప్తులో వెల్లడైంది. దాంతో ఆదాయ పన్ను శాఖ మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్‌లకు నోటీసులు జారీ చేసి వారి వాంగ్మూలాలను నమోదు చేసింది. తాము అక్రమ నిధులను చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కే అందించామని మనోజ్‌ పార్థసాని, యోగేశ్‌ గుప్తా వాంగ్మూలంలో స్పష్టం చేశారు. షెల్‌ కంపెనీల ద్వారా మళ్లించిన నిధులను వారిద్దరి నుంచి చంద్రబాబు తరఫున తాను స్వీకరించానని పెండ్యాల శ్రీనివాస్‌ కూడా అంగీకరిస్తూ వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. 

ఈడీ దర్యాప్తులోనూ ‘స్కిల్‌’ కుంభకోణం బట్టబయలు 
♦ ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్ట్‌ పేరిట షెల్‌ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించిన అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించి ఇప్పటి వరకు డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్, సీమెన్స్‌ కంపెనీ భారత ప్రతినిధిగా గతంలో వ్యవహరించిన సుమన్‌బోస్‌లతోపాటు నలుగురిని అరెస్ట్‌ చేసింది.

♦  డిజైన్‌ టెక్‌ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది. ఈ మేరకు ఈడీ పత్రికా ప్రకటన జారీ చేయడంతోపాటు ట్వీట్‌ కూడా చేసింది. డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌ను ఈడీ ఈ ఏడాది మార్చి 10న అరెస్ట్‌ చేస్తే, మే 12 వరకు జైలులో ఉండి బెయిల్‌పై విడుదలయ్యారు. 

♦  ఈ కుంభకోణంలో చంద్రబాబు భాగస్వామి అయిన ఆయన ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అసలు అక్రమాలే జరగలేదని వీడియోలు విడుదల చేయడం విడ్డూరం. అక్రమాలు చేయకపోతే ఈడీ ఆయనపై కేసు పెట్టి ఎందుకు అరెస్ట్‌ చేసి జైలుకు పంపిందో సమాధానం చెప్పాలి. సీఐడీ కూడా చంద్రబాబుతోపాటు ఇప్పటికే వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌తోపాటు మొత్తం 9 మందిని అరెస్ట్‌  చేసింది. 

♦  సీఐడీ నమోదు చేసిన కేసుపై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం పది గంటలపాటు సుదీర్ఘంగా విచారించింది. ఇరుపక్షాల వాదనలను పూర్తిగా ఆలకించింది. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రాజెక్టులో  చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనడానికి పూర్తి ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందడంతోనే ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది.  

Advertisement
 
Advertisement