ఇంటరాగేషన్‌లో గాయాలు.. వ్యక్తి మృతి!

Chain Snatching in Medak - Sakshi

మెదక్‌ పట్టణంలో చైన్‌ స్నాచింగ్‌ 

అనుమానంతో ఖదీర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 

విడిచిపెట్టాక అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిక.. చికిత్స పొందుతూ మృతి  

మెదక్‌ జోన్‌: చైన్‌ స్నాచింగ్‌ చేశాడనే అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా కొట్టారని.. దానితో కిడ్నీలు దెబ్బతిని మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త చావుకు కారణమైన పోలీసులపై హత్యకేసు పెట్టి, అరెస్టు చేయాలని డిమాండ్‌ చేసింది. 

అసలు ఏం జరిగింది? 
మెదక్‌ పట్టణంలోని అరబ్‌ గల్లీలో జనవరి 27న గుర్తు తెలియని దుండగుడు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తెంపుకెళ్లాడు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించిన పోలీసులు.. ఆ దుండగుడు మహ్మద్‌ ఖదీర్‌ అని అనుమానించారు. మెదక్‌ పట్టణంలో చిన్న పాన్‌షాపు నడుపుకొనే ఖదీర్‌.. అది సరిగా నడవకపోవడంతో కొన్నిరోజులుగా హైదరాబాద్‌లోని తన సోదరి ఇంట్లో ఉంటూ కూలిపనులు చేసుకుంటున్నాడు. అతడి గురించి ఆరా తీసిన పోలీసులు జనవరి 29న హైదరాబాద్‌ వెళ్లి, సోదరి ఇంట్లో ఖదీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌ ఠాణాకు తరలించి ఐదు రోజులపాటు అదుపులో ఉంచుకున్నారు. ఏమీ తేలకపోవడంతో ఫిబ్రవరి 3న మెదక్‌ తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి వదిలేశారు. 

దెబ్బలకు కిడ్నీలు దెబ్బతిని.. 
పోలీసులు వదిలేసిన తర్వాత ఖదీర్‌ తీవ్రంగా అస్వస్థతకు లోనయ్యాడు. ఫిబ్రవరి 6న మెదక్‌ ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు బలమైన దెబ్బలు తగిలి కిడ్నీలు చెడిపోయాయని, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. దీనితో ఖదీర్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి, మూడు రోజులు చికిత్స చేయించారు.

ఈ ఖర్చులను పోలీసులే భరించారని ఖదీర్‌ భార్య తెలిపింది. కానీ ఖదీర్‌ పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి 12న గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 16న రాత్రి మృతి చెందాడు. గురువారం రాత్రే ఖదీర్‌ చనిపోయినా.. కేసు నమోదవకపోవడం, ఎఫ్‌ఐఆర్‌ కాకపోవడంతో మృతదేహానికి శుక్రవారం రాత్రి వరకు పోస్టుమార్టం చేయలేదు. దీనితో పోలీసులు సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేశారు. 

ఎస్సై, కానిస్టేబుళ్లు బదిలీ 
ఖదీర్‌ మృతి నేపథ్యంలో మెదక్‌ పట్టణ ఎస్సై రాజశేఖర్‌ను డీసీఆర్బీకి అటాచ్‌ చేస్తూ.. కానిస్టేబుల్‌ పవన్‌ కుమార్‌ను రేగోడుకు, ప్రశాంత్‌ను పాపన్న పేటకు బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. 

అకారణంగా నా భర్తను చంపేశారు 
దొంగతనం నెపంతో తన భర్తను దారుణంగా కొట్టి చావుకు కారణమైన పోలీసులపై హత్యకేసు నమో దు చేయాలని ఖదీర్‌ భార్య సిద్దేశ్వరి డిమాండ్‌ చేశా రు. దీనిపై శుక్రవారం మెదక్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన భర్తను అకారణంగా చంపి తనను, తన ముగ్గురు పిల్లలను రోడ్డున పడేసిన పోలీసులకు ఉసురు తగులుతుందంటూ ఆమె రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. కాగా.. హైదరాబాద్‌లోని తమ ఇంట్లో ఖదీర్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు దారుణంగా కొట్టారని, కాళ్లు మొక్కినా వినలేదని ఖదీర్‌ సోదరి తపసుల్‌ పేర్కొన్నారు.

పాత నేరస్తుడని అదుపులోకి.. 
‘‘ఖదీర్‌ పాత నేరస్తుడు. అరబ్‌గల్లీలో ఓ మహిళ మెడలోంచి గొలుసు తెంపుకెళ్లిన వ్యక్తి సీసీ పుటేజీలో ఖదీర్‌లా ఉండటంతోనే అదుపులోకి తీసుకున్నాం. ప్రశ్నించిన తర్వాత ఫిబ్రవరి 3వ తేదీన తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి వదిలేశాం. 6వ తేదీన అతడు ఆస్పత్రిలో చేరాడు. మధ్య ఏం జరిగిందో మాకు తెలియదు..’’                
– మెదక్‌ డీఎస్పీ సైదులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top