Crime News: బుల్లెట్‌ బండి మీద కన్నేశారు! ఆపై..

Caught Trying Bullet Vehicle To Sell Stolen Vehicle - Sakshi

పంజగుట్ట: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పంజగుట్ట క్రైమ్‌ టీం అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి ఐదు లక్షలు విలువచేసే నాలుగు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు జిల్లా, జగ్గారెడ్డిగూడెంకు చెందిన దేవ సన్ని అలియాస్‌ మహేష్‌ (26) ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరుకు చెందిన బి.మనోహర్‌ (21) ఇతనికి నాలుగు సంవత్సరాలుగా స్నేహితులు.

త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ద్విచక్రవాహనాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఖరీదైన వాహనాలు దొంగిలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌లు దొంగతనం చేద్దామనుకున్నారు. నగరానికి వచ్చి సరూర్‌నగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌తోపాటు గత ఏప్రిల్‌ నెలలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాఫర్‌అలీ బాగ్‌లో ఒక వాహనం దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గురువారం సాయంత్రం పంజగుట్ట క్రైమ్‌ ఎస్‌ఐ నరేష్‌ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనంపై నిందితులు పట్టుబడ్డారు. పత్రాలు చూపించమంటే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా గతంలో చేసిన దొంగతనాలగూర్చి వివరించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు ఎలా అమ్మలి, కొనే వారు ఎవరైనా దొరుకుతారా అని ఎదురుచూస్తుండగానే పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.  

(చదవండి: 24 గంటలు ఆగాలంటూ..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top