మా అక్కకు జైల్లో భోజనం పెట్టడం లేదు: భూమా మౌనిక

Bowenpally Kidnap Case Bhuma Mounika Press Meet - Sakshi

గాంధీ ఆస్పత్రి సీసీటీవీ ఫుటేజ్‌ బయట పెట్టాలి

ప్రవీణ్‌రావు హెల్త్‌ రిపోర్ట్స్‌ ఎందుకు కోర్టులో ఇవ్వలేదు

ఏ-1 సుబ్బారెడ్డి మీద పోలీసులకు ఎందుకంత నమ్మకం

కేసీఆర్‌ పెద్దమనసు చేసుకుని సమస్యను పరిష్కరించాలి

సాక్షి, హైదరాబాద్‌: ‘టెర్రరిస్టులను కూడా బాగా చూసుకునే దేశం మనది. జైల్లో మా అక్కకు కనీసం భోజనం పెట్టడం లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మా అక్క జైలు నుంచి ప్రాణాలతోనే వస్తుందా అని భయం వేస్తుంది’ అంటూ టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మౌనిక మాట్లాడుతూ.. ‘జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పొలిటికల్ గేమ్ నడుస్తోంది అనిపిస్తోంది. అఖిలప్రియ ఆధారాలు ట్యాంపరింగ్ చేశారు అని పోలీసులు ఆధారాలు కోర్టుకు ఇవ్వకుండా రిమాండ్ రిపోర్టులో చెప్పారు. అఖిలప్రియ హెల్త్ కండిషన్ సరిగ్గా లేకున్నా అంతా బాగుంది అని పోలీసులు చెప్తున్నారు. టెర్రరిస్టులను అయినా సరిగ్గా చూసుకుంటారు. అంతకంటే దారుణమా. ఏ-1 ఏవీ సుబ్బారెడ్డిని పట్టుకొని వదిలేశారు. ప్రవీణ్ రావును కొట్టారు, తిట్టారు అన్నారు.. మరి కోర్టుకు ఎందుకు ఆధారాలు చూపించలేదు. గాంధీ హాస్పిటల్ నుంచి మీడియా, కరెంట్ తీసివేసి ఎందుకు తీసుకెళ్లారు’ అంటూ మౌనిక పలు ప్రశ్నలు సంధించారు.

వేరే రాష్ట్రం నుంచి వస్తే.. ఇక్కడ ఉండనివ్వరా?
ఇక ‘ల్యాండ్ సమస్య మా నాన్న ఉన్నప్పటి నుంచి కొనసాగుతుంది. వాళ్ళ మరణం తరువాత మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. భూమా కుటుంబం ఏపీకే కాదు ఇరు ప్రాంతాలకు సేవలు చేశారు. ఆళ్లగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వ్యక్తులా. సెటిలర్లు ఓట్లు వేస్తేనే కదా జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌‌కు సీట్లు వచ్చాయి. ఆ విషయం మర్చిపోయారా. పోలీసుల స్టేట్‌మెంట్‌ సరిగ్గా లేదు. ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేసే విధానం ఇదేనా. అఖిల-సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు అని పోలీసులు చెప్పి.. రాత్రికి రాత్రి పూర్తిగా మార్చేశారు. గాంధీ హాస్పిటల్ సీసీటీవీ ఫూటేజ్‌ బయటపెట్టాలి. పోలీసులు జడ్జీలు అన్నట్లు చెప్తున్నారు. అఖిలప్రియ నేరం చేసినట్లు కోర్టుకు ఒక్క ఆధారం కూడా చూపించలేదు. ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉంటే ఇంత ఇబ్బంది పడాలా. వైద్యుల డ్యూటీ కూడా పోలీసులే చేస్తున్నారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉంది అని అనుమానం కలుగుతోంది. వేరే రాష్ట్రం నుంచి వస్తే రాష్ట్రంలో ఉండనివ్వరా. అఖిలప్రియపై పోలీసులు రోజుకో కొత్త కేసు పెడుతున్నారు’ అని మౌనిక ఆరోపించారు. (చదవండి: ఎందుకు చంపాలనుకున్నారు?)

ఇక భార్గవ్‌ రామ్‌ వస్తే ఏం చేస్తారో
‘ఆ ల్యాండ్ మా నాన్నది... అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. మేము పుట్టింది ఆళ్లగడ్డలో అయినా పెరిగింది సిటీలోనే. మేము హైదరాబాద్‌లో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా అని అనిపిస్తోంది. మా జీవితాలు సినిమా చూసినట్లు ఉంది. మేము సీఎం కేసీఆర్ని రిక్వస్ట్ చేస్తున్నాం.. మధ్య వర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించండి. పోలీసులు కనీసం ప్రోటోకాల్ ఫాలో కాకుండా మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ల్యాండ్ ధర పెరిగింది అని పోలీసులు అంటున్నారు.. ధర పెరిగినట్లు వాళ్లకు ఎలా తెలుసు. భూమా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ కుళ్లు రాజకీయాలు మాకు వద్దు.. మా కుటుంబ పరంగా వస్తున్న రాజకీయ సేవలు మేము చేస్తున్నాము. 70 ఎకరాల ల్యాండ్ సమస్య ఉంది. మా కుటుంబానికి కావాల్సింది ల్యాండ్ కాదు.. మా అక్క కావాలి. మమ్మల్ని సెటిలర్లుగా.. ఔట్ సైడర్స్‌గా, ఫ్యాక్షనిస్టులుగా చూపిస్తున్నారు. మా అక్కను ఇలా ట్రీట్ చేస్తున్నారు.. ఇక భార్గవ్ రామ్‌ వస్తే ఏం చేస్తారో. ప్రవీణ్ రావు హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో చూపించలేదు. సూపరింటెండెంట్ నాకు కాల్‌ చేసి హెల్త్ రిపోర్ట్స్ కావాలని అడిగారు’ అని తెలిపారు. (చదవండి: అఖిల‌ప్రియకు బెయిల్‌ ఇవ్వొద్దు..)

కేసీఆర్‌ పెద్ద మనసు చేసుకోని సమస్యను పరిష్కరించాలి. 2006 లేదా 2007లో  చాలా మంది పై అక్కడ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, మేము కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. కానీ సీన్ మారింది. ఏవీ సుబ్బారెడ్డి ఆధారాలు ట్యాంపర్ చేయడని పోలీసులకు ఏంటి నమ్మకం. ఏ-1కి నోటీసులు ఇచ్చి... ఏ-2ని పిక్ చేసి అరెస్ట్ చేస్తారా. మేము కూర్చొని మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాము. ఆ ల్యాండ్ ఒక్కరి పేరుమీద లేదు. చాలా కంపెనీలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిడి లేకపోతే ఇంత హడావుడి జరుగదు అనిపిస్తుంది. నేను కేసీఆర్ ఫ్యామిలీని విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి సమస్యను పరిష్కారించండి’ అని మౌనిక అభ్యర్థించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top