Rajasthan: ఎంపీకి అత్యంత సన్నిహితుడు, బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు..

BJP Leader Shot Dead On Way Home In Rajasthan - Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. భరత్‌పూర్‌లో కిర్పాల్‌ సింగ్‌ అనే బీజేపీ నాయకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కిర్పాల్‌ తన కారులో సర్క్యూట్‌ హౌస్‌ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది రెండు బైక్‌లు, అనేక కార్లలో వచ్చి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల్లో సింగ్‌కు ఏడు బుల్లెట్లు గాయాలయ్యాయి.

సింగ్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పులు జరిపిన నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు, అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు.

కాగా కిర్పాల్‌ సింగ్‌.. భరత్‌పూర్‌ బీజేపీ ఎంపీ రంజీతా కోలికి అత్యంత సన్నిహితుడు. సింగ్‌ మరణవార్త తెలిసిన వెంటనే ఎంపీ రంజీతా కోలి ఆసుపత్రికి వెళ్లారు. డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు, కిసాన్ మోర్చా మాజీ ప్రతినిధి కిర్పాల్ సింగ్ మృతిచెందడం వల్ల ఈ రోజు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు ఎంపీ కోలీ హిందీలో ట్వీట్ చేశారు.
చదవండి: కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top