ఆ సమయంలో ఆశిష్‌ ఎక్కడ?

Ashish Mishra sent to 14-day judicial custody - Sakshi

పోలీసుల విచారణలో మంత్రి కుమారుడి పొంతన లేని సమాధానాలు

14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి తరలింపు

న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా సిట్‌ విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు చాలా ప్రశ్నలకి ఆయన సమాధానమే ఇవ్వలేదని సమాచారం. నలుగురు రైతుల్ని బలిగొన్న వాహనం దూసుకుపోయిన ఘటన సమయంలో ఆశిష్‌ మిశ్రా ఎక్కడ ఉన్నాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

పోలీసుల్లో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు లఖీమ్‌పూర్‌ ఖేరిలో హింస చెలరేగినప్పుడు తాను అక్కడికి 4–5 కి.మీ. దూరంలో జరుగుతున్న రెజ్లింగ్‌ పోటీల వద్ద ఉన్నట్టుగా ఆశిష్‌ విచారణలో వెల్లడించారు. అజయ్‌ మిశ్రా స్వగ్రామమైన భవానీపూర్‌లో నిర్వహించిన ఈ రెజ్లింగ్‌ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవడానికి కేంద్ర మంత్రి వెళుతుండగానే అక్టోబర్‌ 3న హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్‌ ఎదుట లొంగిపోయిన ఆశిష్‌ని 12 గంటల సేపు ప్రశ్నించిన తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా... అతనిని 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినట్లు సీనియర్‌ ప్రాసిక్యూషన్‌ అధికారి ఎస్‌పీ యాదవ్‌ చెప్పారు. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేశారు.  

ఆ మూడు పాయింట్లు..  
ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన మూడు పాయింట్లు గమనిస్తే ఆశిష్‌ వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థమవుతోందని సిట్‌ పోలీసులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం...  

► లఖీమ్‌పూర్‌ ఖేరిలో వాహనం దూసుకుపోయిన ఘటన జరిగినప్పుడు తాను రెజ్లింగ్‌ కార్యక్రమంలో ఉన్నానని ఆశిష్‌ చెప్పారు. అయితే రెజ్లింగ్‌ కార్యక్రమం దగ్గర పహారాగా ఉన్న పోలీసు సిబ్బంది ఆశిష్‌ ఆ కార్యక్రమానికి వచ్చినప్పటికీ 2 నుంచి 4 గంటల మధ్య కనిపించకుండా పోయారని వెల్లడించారు.  

► ఆశిష్‌ మిశ్రా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా ఆయన ఉండే ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆ సమయంలో హింసాకాండ జరిగిన స్థలంలోనే ఉన్నారని తేలింది. ఇదే విషయాన్ని సిట్‌ అధికారులు నిగ్గదీసి అడిగితే ఆశిష్‌ మళ్లీ మాట మార్చి ఆ సమయంలో తాను తమ రైస్‌మిల్లుకి కూడా వెళ్లానని, హింస చెలరేగిన ప్రాంతానికి అది దగ్గరలో ఉందని, ఈ రెండు ప్రదేశాలు ఒకే మొబైల్‌ టవర్‌ కిందకి వస్తాయంటూ వాదించారు. ఈ రెండు అంశాలూ ఆశిష్‌ మిశ్రాకు వ్యతిరేకంగా ఉండబట్టే అరెస్టు జరిగిందని సమాచారం.  
     
► రైతుల ఊసే లేకుండా దాఖలు చేసిన రెండో ఎఫ్‌ఐఆర్‌ (డ్రైవర్‌ను, బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టి చంపిన కేసు)లో పరిశీలించినా ఆశిష్‌ అన్నీ నిజాలు చెప్పడం లేదని అర్థమవుతుంది. రైతుల మీదకి దూసుకుపోయిన వాహనం తనదేనని అంగీకరించిన ఆశిష్‌ ఆ సమయలో తాను అందులో లేనని మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో ఆశిష్‌ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవింగ్‌ సీటులో ఉన్నది ఆశిష్‌ కాదని, అతని డ్రైవర్‌ హరిఓం అని చెబుతున్నారు. డ్రైవింగ్‌ సీటులో డ్రైవర్‌ హరిఓం ఉన్నాడని, అతను తెల్ల చొక్కా లేదంటే కుర్తా ధరించాడని ఎఫ్‌ఐఆర్‌లో కూడా రాశారు. వీడియో పరిశీలనలో కూడా తెల్లచొక్కా ధరించిన వ్యక్తే నడుపుతున్న పోలీసులు గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన డ్రైవర్‌ మృతదేహంపై పసుపు చొక్కా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆశిష్‌ వాస్తవాలు దాచి పెడుతున్నారని తెలుస్తోందని సిట్‌ పోలీసుల వాదనగా ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top