కాకినాడలో రవాణాశాఖ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు | Sakshi
Sakshi News home page

దారుణం: కాకినాడలో రవాణాశాఖ బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి.. తెగిపడిన వేలు

Published Fri, Mar 17 2023 10:36 AM

Andhra Pradesh: Coconut Merchant Attacked With Knife On Motor Vehicle Brake Inspector - Sakshi

కాకినాడ క్రైం: ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్‌ గడువు ముగిసినందున వాహ­నాన్ని సీజ్‌ చేసేందుకు యత్నించిన అధికారి, అతని డ్రైవర్‌పై వాహన యజమాని హత్యాయత్నానికి పాల్పడిన  ఘట­న జిల్లా కేంద్రం కాకినాడలో చోటు చేసుకుంది. పోలీసుల కథ­నం ప్రకారం.. కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన పెంటా వెంకట దుర్గాప్రసాద్‌ ఆటోపై కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక ఫెలోషిప్‌ సెంటర్‌లోని దేవదా­య, ధర్మదాయ శాఖ కార్యాలయం సమీపాన శుక్రవారం ఉదయం ఆటో నిలిపి వ్యాపారం చేసుకుంటున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)గా విధులు నిర్వర్తిస్తున్న మిద్దే చిన్నారావు అక్కడకు వెళ్లారు.

దుర్గాప్రసాద్‌ ఆటో నంబరు తనిఖీ చేసి, గతేడాది నవంబర్‌లోనే వాహనం ఫిట్‌నెస్‌ ముగిసిందని, ఇన్‌స్రూెన్సు కూడా లేదని చెప్పారు. ఈ క్రమంలో ఆటో­ను సీజ్‌ చే­సేం­దుకు సిద్ధమయ్యారు. వద్దని దుర్గాప్రసాద్‌ వారించాడు. తాను ఆటో నడుపుతూ వ్యాపారం చేయడం లేదని, కేవలం రోడ్డు పక్కన నిలిపి మాత్రమే జీవనోపాధి కోసం వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారావు ఆటోను సీజ్‌ చేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో దుర్గాప్రసాద్‌ ఆటో వద్దకు వెళ్లి  కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొచ్చాడు.

కారులో ఉన్న చిన్నారావును బెదిరించేందుకు కా­రు అద్దంపై కత్తితో వేటు వేశాడు. ‘ఏంటి చంపుతావా?’ అంటూ చిన్నారావు బయటకి రాబోయారు. అప్పటికే వర్షం పడుతుండడంతో కారు దిగిన వెంటనే చిన్నారావు కాలు జారి పడిపోయా­డు. ఆయనపై దుర్గాప్రసాద్‌ కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దాడిని నిలువరించేందుకు ఏఎంవీఐ కారు డ్రైవర్‌ గుత్తు­ల వీర వెంకట సత్యనారాయణ యత్నించగా దుర్గాప్రసాద్‌ అత­డి పైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారావు మెడ, తల, చేయి, పొట్ట భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేలు తెగి పడింది. పెద్దపేగు పూర్తిగా బయటికి వచ్చేసింది. డ్రైవర్‌ సత్య­నారాయణకు రెండు చేతులపై గాయాలయ్యాయి.

డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని జీజీహెచ్‌ సూప­రింటెండెంట్‌ డాక్టర్‌ హేమలతాదేవి తెలిపారు. కాగా కత్తి దాడి­లో తెగిపడిన చిన్నారావు చేతి వేలిని అతికించేందుకు జీజీహెచ్‌ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చిన్నారావు శరీరంపై మొత్తం 34 కత్తిపోట్లు, గాయాలు గుర్తించామని వైద్యులు తెలిపారు.  జీజీహెచ్‌లో బాధిత కుటుంబ సభ్యులను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.­ఇల­క్కియా, ఎస్పీ ఎం.
రవీంద్రనాథ్‌బాబు పరామర్శించారు. నిందితుడు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేశామని టూ టౌన్‌ సీఐ నాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement