కిల్లర్‌ సినిమా రేంజ్‌లో హత్య...గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో..

Accused Sent Parcel To Rajasthan In Ambulance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పనిచేసే చోట తరచూ యజమానికి ఫిర్యాదు చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు.. స్పానర్‌తో తలపై మోది హత్య చేశాడు.. పోలీసులకు తెలిస్తే ఇబ్బందులొస్తాయని యజమానులూ జాగ్రత్త పడ్డారు.. గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని సొంతూరికి సాగనంపారు. కిల్లర్‌ సినిమాను తలపించే హత్య కేసును పహాడీషరీఫ్‌ పోలీసులు చాకచక్యంగా చేధించారు.  

►రాజస్థాన్‌ పాలి జిల్లా, రాంపుర కాలా గ్రామానికి చెందిన ఓంప్రకాశ్, సునీల్‌ హైదరాబాద్‌లో ఉంటూ మీర్‌పేట శ్రీరామ్‌కాలనీలో శ్రీసాన్వి ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇదే కంపెనీలో పాలి జిల్లా, జైతరణ్‌కు చెందిన మహేంద్రజీ చౌదరి (45), ఉత్తర్‌ప్రదేశ్‌ కౌశాంబి జిల్లా చందుపురంరాయన్‌కు చెందిన రోహిత్‌ కుమార్‌ పని చేసేవారు. అయితే రోహిత్‌ సరిగ్గా పని చేయడం లేదని తరుచూ అతనిపై యజమానికి మహేంద్రజీ ఫిర్యాదు చేసేవాడు.

►మహేంద్రపై కక్ష పెంచుకున్న రోహిత్‌ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు..  పనిచేస్తున్న సమయంలో స్పానర్‌తో మహేంద్ర తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్రజీని కంపెనీ యజమానులు శివరాంపల్లిలోని చంద్రా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేంద్ర మృతి చెందాడు. 

గుండెపోటుగా చిత్రీకరించి.. 
అయితే హత్య విషయం బయటికి పొక్కితే  ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన యజమానులు ఓం ప్రకాశ్, సునీల్‌ పథకం పన్నారు. గుండె పోటుతో మహేంద్ర మరణించాడని ఆసుపత్రి నుంచే రోహిత్‌ చేత మహేంద్ర మామ ప్రకాశ్‌కు అక్టోబర్‌ 4న ఫోన్‌ చేయించారు.

ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. హత్య సమాచారం పోలీసులకు అందించకుండా, మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకుండా ఆసుపత్రి యాజమాన్యాన్ని మేనేజ్‌ చేశారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగే వరకూ రోహిత్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపించేశారు. 

గాయాలు కనిపించకుండా పార్సిల్‌.. 
హంతకుడి సూచన మేరకు శివరాంపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన ప్రకాశ్‌ అంబులెన్స్‌లో పూర్తిగా ప్యాక్‌ చేసి ఉన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అనంతరం మృతదేహాన్ని సొంతూరైన బాగియాడకు తీసుకెళ్లారు. చివరి చూపు కోసం మహేంద్రజీ మృతదేహాన్ని తెరిచి చూసిన అతడి కుమారుడు  పాబురాంజీ జాఖర్‌ మృతుడి తల, శరీరంపై బలమైన గాయాలున్నట్లు గుర్తించాడు. దీంతో తమ తండ్రి గుండె పోటుతో మరణించలేదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్‌ 31న రాజస్థాన్‌లోని జైతారామ్‌ ఠాణాలో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. 
రాజస్థాన్‌ పోలీసులు కేసును పహాడీషరీఫ్‌ ఠాణాకు బదిలీ చేయడంతో.. రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులను విచారించారు. క్రైమ్‌ సీన్‌ను రీ–కన్‌స్ట్రక్షన్‌ చేశారు. రోహితే హంతకుడని తేల్చే కీలక సాక్ష్యాధారాలు సేకరించారు.

అయితే హత్య కేసు సద్దుమణిగిందని భావించిన రోహిత్‌ ఈనెల 14న యూపీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి యధావిధిగా  పనిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం రోహిత్‌ను అరెస్టు చేసి, విచారించగా.. మహేంద్రజీని తలపై స్పానర్‌తో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఫ్యాక్టరీ యజమానులు ఓంప్రకాశ్, సునీల్‌ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో ముగ్గురిని అరెస్టు చేసి జ్యూడిషయల్‌ రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన స్పానర్‌ను  స్వా«దీనం చేసుకున్నారు.  

(చదవండి: ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top