Tamil Nadu: మాజీ మంత్రా.. మజాకా.. ఐదేళ్లలో ఆస్తి పదింతలు

ACB Says MR Vijay Bhaskar Assets Will Increase Ten Times In Tamil Nadu - Sakshi

మాజీమంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఆస్తులపై ఏసీబీ అంచనా 

స్థిర, చరాస్తి పత్రాలు స్వాధీనం

బ్యాంకు లాకర్లు సీజ్‌ 

నేరుగా విచారణకు త్వరలో సమన్లు,చార్జిషీట్‌ 

సాక్షి ప్రతినిధి, చెన్నై: మంత్రా.. మజాకా. మాజీ మంత్రి (అన్నాడీఎంకే) ఎంఆర్‌ విజయభాస్కర్‌ గత ఐదేళ్లలో తన ఆస్తిని పదింతలు చేసినట్లు ఆవినీతి నిరోధకశాఖ అధికారులు అంచనావేశారు. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టిన ఆరోపణలపై ఈనెల 22న జరిపిన దాడుల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకుని, బ్యాంకు లావాదేవీలు, లాకర్లు, కంపెనీ పత్రాలను సీజ్‌ చేశారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రవాణాశాఖా మంత్రిగా వ్యవహరించిన ఎంఆర్‌ విజయభాస్కర్‌ రవాణాశాఖలో ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సులు, విడిభాగాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు అందిన ఫిర్యాదు మేరకు దాడులు జరిగాయి.

చెన్నై, కరూరు జిల్లాల్లో ఏకకాలంలో 21 ప్రత్యేక బృందాలు మాజీ మంత్రికి చెందిన పరిశ్రమలు, బంధువుల ఇళ్లు, ఆయన అనుచరుడైన అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్‌ ఏకాంబరం ఇంటిలో గురువారం ఉదయం 6.30 గంటల నుంచి నిర్విరామంగా 14 గంటలపాటూ గురువారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపారు. అయితే 26 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఆయన అధికార, అనధికార కార్యకలాపాలకు నెలవైన చెన్నై రాజా అన్నామలైపురంలోని అపార్టుమెంటు నుంచి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్, పెన్‌ డ్రైవ్‌లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.  కాగా, ఎంఆర్‌ విజయభాస్కర్, ఆయన సతీమణి విజయలక్ష్మి, సోదరుడు శేఖర్‌ భాగస్వామ్యులుగా ఉన్న సంస్థలు, బంధువులు, సహాయకులపై కేసులు నమోదు చేశారు.

కొందరు బినామీలు చిక్కారని తెలుస్తోంది. సదరు కంపెనీల బ్యాంకు లావాదేవీలను, లాకర్లను సీజ్‌ చేశారు. చెన్నై, కరూరు జిల్లాల్లో 26 చోట్ల తనిఖీలు జరిగిన చోట్ల నుంచి రూ.25.56 లక్షల నగదు, కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు,  పెట్టుబడులు, కంపెనీలకు చెందిన లావాదేవీల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అంతేగాక చెన్నైలోని ఇంటి నుంచి 50 సవర్ల నగలు, రెండున్నర కిలోల వెండి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి తిరిగి ఇచ్చేశారు.

దాడుల సమయంలో ఇంటిలోనే ఉండిన మాజీ మంత్రి విజయభాస్కర్‌ వద్ద ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. మంత్రి పదవిలోకి రాకముందు, ఆ తరువాత ఆస్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 26 చోట్లలో స్వాధీనం చేసుకున్న నగదు, స్థిర, చరాస్తులతో పోల్చిచూసుకుని పదింతలు ఆస్తి సంపాదించినట్లు తేలిందని ఏసీబీ వర్గాలు నిర్ధారించుకున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి మరింత లోతుగా విచారణ జరిపి చార్జిషీటు దాఖలు చేయనున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top