ఖాఛీకొడతారు! | - | Sakshi
Sakshi News home page

ఖాఛీకొడతారు!

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

లంచాల నుంచి దారిదోపిడీ నేరాల్లో ఖాకీలు సస్పెన్షన్లు.. అరెస్టులకు దారితీస్తున్న అత్యాశ వరుస ఘటనలతో బజారున పోలీసుల పరువు

‘ మీకు పదే పదే చెబుతున్నా. జిల్లాలో పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి. స్టేషన్‌కు వచ్చే వాళ్లతో మర్యాద మాట్లాడండి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌, విజిబుల్‌ (కనిపించేలా) పోలీసింగ్‌ నాకు ముఖ్యం. సామాన్యులకు పోలీసుల వల్ల ఇబ్బందులు రాకూడదు.’

– క్రైమ్‌ మీటింగ్‌లో ఎస్పీ తుషార్‌ డూడీ

‘క్రికెట్‌ బెట్టింగుల్లో రూ.10 లక్షల లంచం. గుట్కా వ్యాపారుల వద్ద రూ.2 లక్షల లంచం. టెంకాలు కొనడానికి వచ్చిన వ్యాపారి వద్ద రూ.10 లక్షలు దారి దోపిడీ. నకిలీ నోట్లు కావాలన్నా సరఫరా చేసే ధైర్యం. పేకాట క్లబ్బులు, లాటరీ నిర్వాహకుల నుంచి లంచాలు. తీరా సస్పెన్షన్లు.. కటకాలపాలు.’

– ప్రస్తుతం జిల్లాలో కొందరు ఖాకీల తీరు ఇదీ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లా పోలీసు శాఖ పరువు బజారున పడుతోంది. కొందరు ఖాకీలు చేస్తున్న తప్పుడు పనులు ఆ శాఖలోనిజాయితీగా పనిచేస్తున్న వాళ్లు తలెత్తుకోలేని స్థితికి దారితీస్తోంది. అది కూడా జిల్లా పోలీసు బాసు కూర్చునే చిత్తూరు జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఈ తరహా ఘటనలు పోలీసుల పనితీరునే ప్రశ్నిస్తోంది. చిత్తూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడుతున్న ఓ ముఠాను వంచన చేసి, నిందితులను తప్పించడానికి రూ.లక్షల్లో లంచాలు వసూలు చేసిన ఆరోపణల్లో ఓ సీఐ సస్పెన్షన్‌కు గురవడం తెలిసిందే. దానికిముందు ఇదే స్టేషన్‌లో పనిచేసిన మరో అధికారి ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగ నుంచి రూ.లక్షలు నొక్కేసి.. బాధితుడికి తూతూమంత్రంగా రికవరీ ఇచ్చి బదిలీకి గురయ్యారు. అలాగే చిత్తూరులో గుట్కా వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేయడం, లింగ నిర్ధారణ పరీక్షల్లో స్వయంగా కలెక్టర్‌ ఫిర్యాదు చేసిన కేసుల్లోనూ నిందితుల నుంచి లంచాలు వసూలు చేయడం చిత్తూరులో పోలీసులకే సాధ్యపడుతోంది.

ఎస్పీ మాటంటే లెక్కలేదా?

ప్రతి నెలా నిర్వహించే క్రైమ్‌ మీటింగ్‌ నుంచి రోజూ జరిగే టెలీకాన్ఫరెన్స్‌ వరకు ఎస్పీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని, పోలీసులు తప్పుచేస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని పదేపదే చెబుతుంటారు. కానీ ఇవి క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి ఎక్కడం లేదని తెలుస్తోంది. ఆర్ముడు రిజర్వు విభాగంలో పనిచేసే హెడ్‌కానిస్టేబుల్‌ రవిచంద్ర తన యూనిఫామ్‌ను అడ్డుపెట్టుకుని చేయని ఆకృత్యాలు లేవని చెబుతున్నారు. మహిళల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి కొందరిని లొంగతీసుకున్నాడని, గతంలో మోసాలకు పాల్పడ్డప్పుడు ఓ క్రిమినల్‌ కేసు కూడా నమోదైనట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. అయితే తాజా ఘటనలో గంగాధరనెల్లూరుకు చెందిన ప్రధాన నిందితుడు సెల్వం పన్నిన పన్నాగంలో చిత్తూరు ట్రాఫిక్‌ ఏఎస్‌ఐగా పనిచేస్తున్న లోకనాథం ఇరుక్కోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది. హెడ్‌కానిస్టేబుల్‌ రవిచంద్ర లాంటి మోసగాడు ఈతరహా నేరాలు కొత్తేమీకాదు. కానీ ఏఎస్‌ఐ లోకనాథంకు పోలీసుశాఖ వివాదరహితుడిగా పేరుంది. ఆర్థిక స్థిరత్వం ఉన్న ఈయన, తన స్నేహితుడు సెల్వం పిలిచాడని వెళ్లి ఈ కేసులో చిక్కుకున్నారు. పిల్లలు ప్రాజెక్టు పనులకు వాడే కరెన్సీ నోట్లు రూ.30 లక్షల వరకు సేకరించిన సెల్వం.. దొంగనోట్ల రాకెట్‌ కూడా ఏదైనా చేశాడా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

డిస్మిస్‌ యోచన?

పోలీసుశాఖ పరువును బజారున పడేసిన ఈ ఘటనపై ఎస్పీ డూడీ చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారనే సమాచారం తెలియగానే, వాళ్లను సైతం అరెస్టుచేసి రిమాండుకు తరలించాలని ఆదేశించారు. తాజాగా రవిచంద్రను పోలీసుశాఖ నుంచి డిస్మిస్‌ చేయడానికి ఉన్నతాధికారులకు ఎస్పీ నివేదిక పంపనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఇద్దరు పోలీసుల సస్పెన్షన్‌

దారిదోపిడీకి పాల్పడి, అరెస్టయిన ఇద్దరు పోలీసులను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ చిత్తూరు ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశాలు జారీచేశారు. మూడు రోజుల క్రితం గంగాధరనెల్లూరులో జరిగిన ఈ ఘటనలో అక్కడి పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించిన విషయం తెలిసిందే. ఇందులో చిత్తూరు ట్రాఫిక్‌ ఏఎస్‌ఐ లోకనాథం, ఆర్ముడు రిజర్వు విభాగంలో పనిచేస్తున్న హెడ్‌కానిస్టేబుల్‌ రవిచంద్ర కూడా ఉండడం.. నిందితులు అరెస్టయ్యి 24 గంటలు దాటడంతో ఎస్పీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లిద్దరినీ విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement